
చికిత్స పొందుతూ చిన్నారి వైష్ణవి మృతి
హైదరాబాద్ : మెదక్ జిల్లా మాసాయిపేట ఘటనలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారుల్లో వైష్ణవి (11) అనే విద్యార్థిని యశోదా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది. దాంతో ఇప్పటిదాకా మరణించిన విద్యార్థుల సంఖ్య 18కి చేరుకుంది. ఈ నెల 24న జరిగిన ప్రమాదంలో సంఘటనా స్థలిలోనే 14 మంది చిన్నారులు, బస్సు డ్రైవర్, క్లీనర్ దుర్మరణం చెందిన సంగతి విదితమే.
తీవ్రంగా గాయపడ్డ 20 మంది విద్యార్థ్ధులను అదే రోజు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందజేస్తున్నారు. వారిలో ప్రశాంత్, వరుణ్‌గౌడ్, వైష్ణవి, తరుణ్‌ల పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేషన్ పైనే ఉంచి వైద్యసేవలను అందజేస్తున్నారు. వీరిలో చిన్నారి తరుణ్ గతరాత్రి మృతి చెందాడు. యశోద ఆస్పత్రి ఆవరణలో విషాదఛాయలు అలముకున్నాయి. మరోవైపు తీవ్రంగా గాయపడ్డ పిల్లల్లో ప్రశాంత్ (6), వరుణ్‌గౌడ్ (7)) పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది.