కన్నుమూసిన మరో చిన్నారి
తూప్రాన్: రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైష్ణవి(11) యశోద ఆసుపత్రిలో మృత్యువుతో ఆరు రోజులుగా పోరాడి మంగళవారం తెల్లవారు జాము న తుదిశ్వాస విడిచింది. వైష్ణవి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం ఇస్లాంపూర్ గ్రామానికి తీసుకుచ్చారు. అప్పటికే వైష్ణవి మృతి చెందిన విషయంలో తెలియడంతో బంధువులు పెద్దసంఖ్యలో గ్రామానికి చేరుకున్నారు.
మృతదేహం రావడంతో భోరున విలపించారు. దీంతో మసాయిపేట వద్ద జరిగిన రైలు దుర్ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరుకుంది. ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన తాళ్ల సరోజన, సంజీవ్‌గౌడ్‌ల కుమార్తె వైష్ణవి(11) ఆసుపత్రిలో మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదం అలుముకుంది. ఎలాగైనా వైద్యులు బతికిస్తారని ఆశించిన తల్లికి తీరని గర్భశోకాన్ని మిగిల్చింది. సాయంత్రం అంత్యక్రియలు జరిపించారు. ఇదిలా ఉండగా వైష్ణవి తల్లి సరోజకు కోన్నేళ్ల క్రితం నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లికి చెందిన సంజీవ్‌గౌడ్‌తో పెళ్లి జరిగింది. అయితే కుటుంబ తగాదాల కారణంగా భర్తకు విడాకులు ఇచ్చి ఏడాది కాలంగా గ్రామంలో నివసిస్తోంది.
గ్రామ సమీపంలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో కూలీగా పని చేస్తూ కూతురును ప్రయోజకురాలిని చేయాలనే ఉద్దేశంతో ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తోంది. అయితే వైష్ణవి రైలు ప్రమాదంలో మృత్యువాత పడటంతో తాను ఇంకేవరి కోసం బతకాలని కన్నీటిపర్యంతమైంది. కాగా గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన తలారి శ్రీశైలం, బాలమణి దంపతుల కుమారుడు తరుణ్(9) సోమవారం రాత్రి మృతి చెందగా గాంధీ ఆసుపత్రిలో పోస్టు మార్డం నిర్వహించిన అనంతరం మంగళవారం సాయంత్రం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.