పెప్సోడెంట్ పేస్టు.. పియర్స్ సబ్బు.. చింపాంజీ సోకులు!
హైదరాబాద్: నెహ్రూ జూలాజికల్ పార్కులో ఓ చింపాంజీకి రాజభోగాలు అందుబాటులో ఉంటున్నాయి. ఇది సాధారణ చింపాంజీ కాదు.. ఓ కోటీశ్వరుడు పెంచుకున్నది!! ఈ మధ్యేనే హైదరాబాద్ జూకి వచ్చిన ఈ చింపాంజి పేరు సుజీ (28). సహారా గ్రూపు చైర్మన్ సుబ్రతా రాయ్ పెంచుకున్న ఈ చింపాజీని ఇప్పుడు నగరంలోని జూ కు తీసుకొచ్చారు. చిన్నప్పటి నుంచి లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడిన సుజీ ప్రస్తుతం జూలో కూడా అదే రాజభోగాలు అనుభవిస్తోంది. ఉదయాన్నే పళ్లు తోమడంతో తన దైనందిన జీవితాన్ని మొదలుపెట్టే సుజీ.. ఇందుకు పెప్సోడెంట్ టూత్ పేస్టు తప్ప మరొకటి వాడదు. ఆ తర్వాత స్నానానికి సకల సౌకర్యాలతో కూడిన బాత్ రూమ్, షాంపూ, పియర్స్ సబ్బు ఉండాల్సిందే. స్నాన కార్యక్రమం ముగిశాక కొబ్బరినూనెతో శరీరంపై మర్దన చేసుకుంటుంది.
సర్వాంగ సుందరంగా ముస్తాబైన తర్వాత చక్కని కాఫీ సేవిస్తుంది. ఎప్పుడూ నెస్ కేఫ్ కాఫీని తాగే సుజీ.. అప్పుడడప్పుడూ కాంప్లాన్ ను హెల్త్ డ్రింక్ గా భావిస్తూ తీసుకుంటుంది. ఆ తర్వాత బ్రెడ్, ఫ్రూట్ జామ్, కొన్ని పండ్లతో బ్రేక్ ఫాస్ట్ కానిచ్చేస్తుంది. లంచ్ కోసం తేనె, పండ్లు, కార్న్ ఫ్లేక్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటుంది. కాడ్ బరీ చాక్లెట్స్ అంటే పిచ్చెత్తిపోయే సుజీ కేవలం మినరల్ వాటరే తాగుతుంది. అది కూడా తన బాటిల్ లో మాత్రమే. జూ అధికారులు సుజీ పడుకోవడానికి రోజూ కొత్త బ్లాంకెట్స్ ఇవ్వాల్సిందే.. వాడినది ఇచ్చి దాన్ని మోసం చేయడం అసాధ్యం. ఇక ఎండ వేడిమి ఉంటే కచ్చితంగా కూలర్, ఫ్యాన్ ఉండాల్సిందే. దోమలు లేకుండా ఉంచడం కోసం ఆలౌట్ లాంటి లిక్విడ్ సదుపాయం కూడా తప్పదు మరి. ఈ విషయంపై అధికారులను అడగగా ప్రస్తుతం జైలులో ఉన్న సుజీ పాత యజమాని సుబ్రతా రాయ్‌కి కూడా ఇలాంటి సదుపాయాలు ఉండవని అంటున్నారు.