
ప్రత్యేక హోదాపై నీళ్లు నమిలిన మంత్రి
-మీడియా ప్రతినిధుల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి
-సూటిగా సమాధానం చెప్పమన్న మీడియా
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వ్యవహారమై సూటిగా సమాధానం చెప్పలేక వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ప్రభుత్వ విప్ రవికుమార్ నీళ్లు నమిలారు. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో సాధించారని చెప్పాలనుకుని మంగళవారం రాత్రి 7 గంటలకు హడావిడిగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన మంత్రి.. విలేఖరులు అడిగిన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ‘మనం భోజనం అడిగితే వాళ్లు (కేంద్రం) చికెన్ బిర్యానీ పెడతామంటుంటే వద్దంటారా?’ అని ప్రభుత్వ చీఫ్ విప్ రవికుమార్, మంత్రి పత్తిపాటి వ్యాఖ్యానించినప్పుడు మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రత్యేక హోదా వస్తుందా? రాదా? అనే దానిపై సూటిగా స్పష్టత ఇవ్వాలని కోరారు. కేంద్రమంత్రి అరుణ్ జెట్లీ ప్రత్యేక హోదా రాదని ఎక్కడా చెప్పలేదని, అంతకు మించే సాధిస్తామని మంత్రి బదులిచ్చారు.
‘ప్రత్యేక హోదా వస్తే కేవలం 30 శాతమే నిధులు వస్తాయని, ప్యాకేజీలయితే రాష్ట్రాభివృద్ధికి కావాల్సినన్ని నిధులు వస్తాయని’ మంత్రి, చీఫ్ విప్ చెప్పినప్పుడు ‘ఉల్లిపాయలున్నాయా? అనడిగితే మంచి చింతపండుందన్నట్టుగా’ మీ సమాధానం ఉందని మీడియా ప్రతినిధులు బదులిచ్చారు. ప్రత్యేక హోదా అనేది రాష్ట్ర ప్రజల ఆకాంక్షని, అందుకోసం కొందరు భావోద్వేగాలతో బలిదానాలకూ పాల్పడుతున్న విషయం తెలిసి కూడా ఇలా డొంకతిరుగుడుగా మాట్లాడవద్దని విలేఖరులు వాగ్వాదానికి దిగారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇస్తామన్న 2,250 కోట్ల రూపాయలకే దిక్కులేనప్పుడు కేంద్రం ఇవ్వబోయే ప్యాకేజీలతో సంతృప్తి చెందుతారా? అని విలేఖరులు ప్రశ్నించడంతో మంత్రి, చీఫ్ విప్ మళ్లీ ఇరకాటంలో పడ్డారు. ‘అదీ, ఇదీ రెండూ సాధించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని’ చెబుతూ సమస్యను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. మొత్తం మీద మంత్రి, చీఫ్ విప్ ఏదో చెప్పాలనుకుని మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే అది కాస్తా ఉల్టాపల్టా అయింది.