కోదండరామ్‌ది కాంగ్రెస్ ఎజెండా
► రైతు దీక్షపై హరీశ్‌రావు మండిపాటు
► అభివృద్ధిని అడ్డుకోవడమే ప్రతిపక్షాల లక్ష్యం
రామడుగు: జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ కాంగ్రెస్ పార్టీ ఎజెండాను అమలు చేస్తూ రైతు దీక్షకు దిగారని మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్‌రావుపేట మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం జరిగింది. కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు పనిచేస్తున్నాయని మండిపడ్డారు. మల్లన్నసాగర్‌ను నిర్మిస్తే ధర్నాలు చేసిన కోదండరామ్, ఇప్పుడు రైతు దీక్ష చేయడంలో ఆంతర్యమేమిటో చెప్పాలన్నారు. రామడుగు మండలం కోరటపల్లి వద్ద మోతె ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతిపక్షాలు ఉద్యమాలు చేస్తే తరిమికొట్టాలన్నారు.
వారం రోజుల్లో మోతె ప్రాజెక్టు నిర్మాణంపై ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే శోభతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రానున్న రబీ పంటల కోసం 3వేల మెగావాట్ల విద్యుత్ సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.2,450 కోట్లతో పలు రకాల విద్యుత్‌లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. రూ.25 వేల కోట్లు నీటి వనరుల కోసం బడ్జెట్‌లో పెట్టిన ఘనత మన రాష్ట్రానికి మాత్రమే దక్కిందన్నారు. కార్యక్రమంలో ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే బొడిగె శోభ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్, జెడ్పీటీసీ సభ్యురాలు వీర్ల కవిత తదితరులు పాల్గొన్నారు.