ఆర్డీఎస్పై కాంగ్రెస్ది కొంగ జపం
మంత్రి హరీశ్‌రావు ధ్వజం
సాక్షి, హైదరాబాద్: గత 60 ఏళ్లలో రాజోలిబండ మళ్లింపు పథకానికి (ఆర్డీఎస్) నీళ్లివ్వనిది కాంగ్రెస్ పార్టీ కాదా అని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు నిలదీశారు. ఆర్డీఎస్ వద్ద కాంగ్రెస్ నేతలు దీక్ష చేయడం, వారికి టీటీడీపీ నేతలు మద్దతు పలకడంపై ఆయన మండిపడ్డారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడుతూ ‘‘పదేళ్లపాటు అధికారంలో ఉండి ఆర్డీఎస్‌కు కేటాయించిన 15.09 టీఎంసీల నీటిని కాంగ్రెస్ ఏ ఒక్క రోజన్నా ఇచ్చిందా? అక్కడికేదో గతంలో వీరు ఇచ్చినట్లు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చి ఏదో పోగొట్టిన ట్లు ఏందీ డ్రామాలు?
చేపల కోసం చెరువు దగ్గర జపం చేస్తున్నట్లు నటించే కొంగకు, క్రెడిట్ గేమ్ ఆడుతున్న కాంగ్రెస్‌కు తేడా ఉందా? వీరిది కొంగ జపం కాక మరేంటి’’ అని ధ్వజమెత్తారు. ఆర్డీఎస్‌పై తెలంగాణ కాంగ్రెస్‌ది ఒక మాట, ఏపీ కాంగ్రెస్‌ది మరో మాట అని విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతల, కాళేశ్వరం ప్రాజెక్టులపై టీకాంగ్రెస్, మహారాష్ట్ర కాంగ్రెస్‌లవి వేర్వేరు మాటలని... రాష్ట్రానికో సిద్ధాంతం, రోజుకో మాట.. పూటకో చిత్తంలా కాంగ్రె స్ వ్యవహారం ఉందని దుయ్యబట్టారు. ‘‘దీక్షా శిబిరం వద్ద కనిపించిన జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డి.కె.అరుణ నిన్నటి దాకా మంత్రులేగా? వారు ఏ రోజైనా కర్ణాటకతో ఆర్డీఎస్ ఆనకట్ట ఎత్తు పెంపుపై మాట్లాడి ఉంటే అర్థం ఉండేది’’ అని హరీశ్ పేర్కొన్నారు.
పనులను అడ్డుకున్నది ఎవరు?
గతేడాది కర్ణాటక మంత్రి, సీఈలతో మాట్లాడి తాము పనులు చేయించేందుకు ప్రయత్నించగా కర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు అడ్డుకోలేదా? అని హరీశ్‌రావు నిలదీశారు. రాయలసీమ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్, టీడీపీ నాయకులు బాంబులతో ఆర్డీఎస్ తూములను బద్దలు కొట్టి నీళ్లు తీసుకుపోతామని హెచ్చరించారని, బరిసెలతో, రాళ్లతో దాడి చేశారని... దీనిపై అప్పుడు జానా, ఉత్తమ్‌లు ఎందుకు మాట్లాడలేదన్నారు. ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం ద్వారా కాంగ్రెస్ నేతలు పాలమూరు ప్రజలను కరువు బాట పట్టించారని విమర్శించారు.
ప్రస్తుతం ఆర్డీఎస్ ఎత్తు 6 అంగుళాల పెంపునకు సంబంధించి హెడ్‌వర్క్స్ పనులు మొదల య్యాయని తెలిసీ కాంగ్రెస్ నేతలు దీక్ష చేయడం హాస్యాస్పదమన్నారు. కర్ణాటక 1.2 టీఎంసీలు వాడుకున్నాక, 15.9 టీఎంసీలు మహబూబ్‌నగర్‌కు వస్తాయని, అయితే కర్ణాటక భూభాగంలోని కాల్వల ఆధునీకరణ జరిగితేనే పూర్తి స్థాయి నీళ్లు వస్తాయని, ఆ పనులు పురోగతిలో ఉన్నాయని హరీశ్ తెలిపారు. టీడీపీ నేతలు సైతం ఈ పనులను అడ్డుకోవద్దని... దీనిపై ఏపీ సీఎం చ ంద్రబాబు, మంత్రి దేవినేని ఉమలను ఒప్పించాలని హరీశ్ సూచించారు. ఆర్డీఎస్ ఆధునీకరణకు టీఆర్‌ఎస్ కట్టుబడి ఉందని, తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా ఆర్డీఎస్ టెయిల్ ఎండ్ భూములకు సాగునీరు అందిస్తామన్నారు.