ఊపర్ షేర్వానీ... అందర్ పరేషానీ
కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, మజ్లిస్ పాలనపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు
అబిడ్స్: మజ్లిస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు గతంలో అనేకసార్లు నగరాన్ని పాలించి ‘ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీ...’గా తయారు చేశాయని రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు ఓటు వేస్తే అది మోరీలో వేసినట్లే’నని అన్నారు. గురువారం సాయంత్రం జాంబాగ్‌లో ప్రారంభించిన రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. 65 ఏళ్లు పాలించిన వారి వల్లే గ్రేటర్‌లో మంచినీరు, డ్రైనేజీ, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని విమర్శించారు. మేయర్‌గా టీఆర్‌ఎస్ అభ్యర్థిఉంటే గ్రేటర్ హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో నగరంలో రోజుకు 4-5 గంటల పాటు కరెంట్ కోతలు ఉండేవని... 19 నెలల టీఆర్‌ఎస్ పాలనలో ఏనాడైనా కరెంట్ కోతలు చూశారా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ సంక్షేమ పథకాలతోనే అన్ని వర్గాల వారు ఆదరిస్తున్నారని కేటీఆర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బి.బి.పాటిల్, ఎమ్మెల్సీలు భానుప్రసాద్, వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే కవిత, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, జాంబాగ్, బేగంబజార్ అభ్యర్ధులు ఎం.ఆనంద్ కుమార్‌గౌడ్, రమేష్‌కుమార్‌బంగ్, టీఆర్‌ఎస్ గోషామహల్ అడ్‌హక్ కమిటీ సభ్యులు నందకిషోర్‌వ్యాస్, ఆర్.వి. మహేందర్ కుమార్, ఇన్‌చార్జ్ ప్రేమ్‌కుమార్‌ధూత్, నగర గ్రంథాలయ మాజీ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాథోడ్ పాల్గొన్నారు.