ghmc elctions
-
బెదిరింపులు, కేసులకు భయపడకండి: చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడితే ధైర్యంగా ఎదుర్కోవాలని, అక్రమకేసులు బనాయిస్తే భయపడాల్సిన పనిలేదని గ్రేటర్ కార్యకర్తలకు ధైర్యం నూరిపోశారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. జీహెచ్ఎంసీ నేతలు, కార్యకర్తలతో ఆదివారం ఉదయం విజయవాడ నుంచి టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన బాబు ఆ మేరకు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. 'కేసులకు,బెదిరింపులకు భయపడొద్దు. ఒకవేళ ఏదైనా జరిగితే పార్టీ కార్యాలయానికి ఫోన్ చేసి తెలియజేయండి. తెలంగాణ అధికారులతో నేను మాట్లాడతా. గ్రేటర్లో టీడీపీ బలంగా ఉంది కాబట్టే కేసీఆర్ ఫ్రస్టేషన్ కు గురవుతున్నారు. మీరేం కంగారుపడొద్దు' అని కార్యకర్తలతో బాబు అన్నారు. శనివారం నాటి సభలో కేసీఆర్ కామెంట్లపై స్పందింస్తూ కేసీఆర్ స్ధాయి మరిచి అబద్దాలాడారని మాట్లాడుతున్నారని, మొన్న ఇక్కడేం పనని తనను ప్రశ్నించిన కేసీఆర్.. నిన్న తన భార్యపై అబద్దాలు చెప్పారని, ఈ అసహనం కేసీఆర్‌లో ఫ్రస్టేషన్ వల్ల వచ్చిందన్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలను తమవైపునకు ఫిరాయించుకుని పదేపదే టీడీపీని టార్గెట్ చేయడం, అబద్దాలు చెప్పడం కేసీఆర్ అసహనానికి ప్రతీకగా బాబు అభివర్ణించారు. టీడీపీ బలమైన ఆర్గనైజేషన్ అంటూ తమ కష్టమే తమకు మంచి ఫలితాలను అందిస్తుందన్నారు. ఈ రెండు రోజులు రాత్రింబవళ్లు కష్టపడాలని, ఒక మంచి లక్ష్యం కోసం కలిసికట్టుగా పని చేయాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే రోజుల్లో టీడీపీ మరింత బలపడటానికి గ్రేటర్ ఎన్నికలు ఒక అవకాశం అని చెప్పారు. -
ఊపర్ షేర్వానీ... అందర్ పరేషానీ
కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, మజ్లిస్ పాలనపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు అబిడ్స్: మజ్లిస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు గతంలో అనేకసార్లు నగరాన్ని పాలించి ‘ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీ...’గా తయారు చేశాయని రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు ఓటు వేస్తే అది మోరీలో వేసినట్లే’నని అన్నారు. గురువారం సాయంత్రం జాంబాగ్‌లో ప్రారంభించిన రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. 65 ఏళ్లు పాలించిన వారి వల్లే గ్రేటర్లో మంచినీరు, డ్రైనేజీ, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని విమర్శించారు. మేయర్‌గా టీఆర్ఎస్ అభ్యర్థిఉంటే గ్రేటర్ హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో నగరంలో రోజుకు 4-5 గంటల పాటు కరెంట్ కోతలు ఉండేవని... 19 నెలల టీఆర్ఎస్ పాలనలో ఏనాడైనా కరెంట్ కోతలు చూశారా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ సంక్షేమ పథకాలతోనే అన్ని వర్గాల వారు ఆదరిస్తున్నారని కేటీఆర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బి.బి.పాటిల్, ఎమ్మెల్సీలు భానుప్రసాద్, వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే కవిత, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, జాంబాగ్, బేగంబజార్ అభ్యర్ధులు ఎం.ఆనంద్ కుమార్‌గౌడ్, రమేష్కుమార్బంగ్, టీఆర్ఎస్ గోషామహల్ అడ్‌హక్ కమిటీ సభ్యులు నందకిషోర్‌వ్యాస్, ఆర్.వి. మహేందర్ కుమార్, ఇన్చార్జ్ ప్రేమ్‌కుమార్‌ధూత్, నగర గ్రంథాలయ మాజీ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్ రాథోడ్ పాల్గొన్నారు. -
తలసాని కుమారుడిని ఓటు అడిగిన వసంత యాదవ్
రాంగోపాల్‌పేట్: మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వసంత యాదవ్ ఆదివారం మారేడుపల్లిలోని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటికి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులను కలిసి... కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని అభ్యర్థించారు. మంత్రి ఇంటి ముందే ఉన్న ఆయన కుమారుడు సాయి యాదవ్‌కు కాంగ్రెస్ పార్టీ కరపత్రాన్ని అందిస్తూ... హస్తం గుర్తుకు ఓటేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన నవ్వుతూ ‘ఆల్‌ది బెస్ట్’ అంటూ అభినందనలు తెలిపారు. -
వైఎస్ పథకాలే శ్రీరామరక్ష
గ్రేటర్లో పార్టీ జెండా ఎగురవేయాలి టీఆర్ఎస్ కల్లబొల్లి కబుర్లను ప్రజలు నమ్మొద్దు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్ సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశారని, ఆ పథకాలే ఇప్పుడు వైఎస్సార్సీపీకి శ్రీరామరక్ష అని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి శివకుమార్ అన్నారు. శనివారం వనస్థలిపురం పనామా చౌరస్తాలోని బొమ్మిడి లలితా గార్డెన్లో జరిగిన వైఎస్సార్సీపీ ఎల్బీనగర్ నియోజకవర్గం సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వైఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్లి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేయాలని ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీని వైఎస్సార్ ఏర్పాటు చేశారని, మెట్రోరైలు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు తదితరాలు ఆయన హయాంలోనే రూపుదిద్దుకున్నాయన్నారు. 2009 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కనీసం పోటీలో కూడా లేని టీఆర్ఎస్ నేడు అధికారబలంతో అడ్డదారుల్లో మేయర్ పీఠం చేజిక్కించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి మాట్లాడుతు పార్టీలో పనిచేస్తున్న అందరికీ గుర్తింపు ఉంటుందని, కార్పొరేటర్లుగా పోటీ చేయదలచిన వారు ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకోవాలని సూచించారు. పార్టీ 150 డివిజన్లలో పోటీ చేస్తుందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు జి.సురేష్‌రెడ్డి నాయకులు రాఘవనాయుడు, వెంకటకృష్ణ తదితరులు మాట్లాడారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సూరజ్ యజ్దాని, సంయుక్త కార్యదర్శి దుబ్బాక గోపాల్‌రెడ్ది, మైనార్టీ నాయకులు మాసూమ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
జీహెచ్ఎంసీ ఎన్నికల కేసు విచారణ వాయిదా
-
జీహెచ్ఎంసీ ఎన్నికల కేసు విచారణ వాయిదా
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)ఎన్నికలపై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఇప్పటి వరకు ఎందుకు నిర్వహించడంలేదని, ప్రభుత్వ వైఖరి ఏమిటో తేల్చాలని గతంలో హైకోర్టు తెలంగాణ సర్కార్‌కు మొట్టికాయలు వేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే ఈ ఎన్నికలపై హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన జీహెచ్ఎంసీ ఎన్నికల అంశం మరోసారి వాయిదా పడింది.