బెదిరింపులు, కేసులకు భయపడకండి: చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడితే ధైర్యంగా ఎదుర్కోవాలని, అక్రమకేసులు బనాయిస్తే భయపడాల్సిన పనిలేదని గ్రేటర్ కార్యకర్తలకు ధైర్యం నూరిపోశారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. జీహెచ్‌ఎంసీ నేతలు, కార్యకర్తలతో ఆదివారం ఉదయం విజయవాడ నుంచి టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన బాబు ఆ మేరకు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.
'కేసులకు,బెదిరింపులకు భయపడొద్దు. ఒకవేళ ఏదైనా జరిగితే పార్టీ కార్యాలయానికి ఫోన్ చేసి తెలియజేయండి. తెలంగాణ అధికారులతో నేను మాట్లాడతా. గ్రేటర్‌లో టీడీపీ బలంగా ఉంది కాబట్టే కేసీఆర్ ఫ్రస్టేషన్ కు గురవుతున్నారు. మీరేం కంగారుపడొద్దు' అని కార్యకర్తలతో బాబు అన్నారు. శనివారం నాటి సభలో కేసీఆర్ కామెంట్లపై స్పందింస్తూ కేసీఆర్ స్ధాయి మరిచి అబద్దాలాడారని మాట్లాడుతున్నారని, మొన్న ఇక్కడేం పనని తనను ప్రశ్నించిన కేసీఆర్.. నిన్న తన భార్యపై అబద్దాలు చెప్పారని, ఈ అసహనం కేసీఆర్‌లో ఫ్రస్టేషన్ వల్ల వచ్చిందన్నారు.
ఐదుగురు ఎమ్మెల్యేలను తమవైపునకు ఫిరాయించుకుని పదేపదే టీడీపీని టార్గెట్ చేయడం, అబద్దాలు చెప్పడం కేసీఆర్ అసహనానికి ప్రతీకగా బాబు అభివర్ణించారు. టీడీపీ బలమైన ఆర్గనైజేషన్ అంటూ తమ కష్టమే తమకు మంచి ఫలితాలను అందిస్తుందన్నారు. ఈ రెండు రోజులు రాత్రింబవళ్లు కష్టపడాలని, ఒక మంచి లక్ష్యం కోసం కలిసికట్టుగా పని చేయాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే రోజుల్లో టీడీపీ మరింత బలపడటానికి గ్రేటర్ ఎన్నికలు ఒక అవకాశం అని చెప్పారు.