మున్సిపల్ శాఖ పనులపై మంత్రి కేటీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ శాఖకు బడ్జెట్‌లో కేటాయించిన నిధుల వివరాలు, ఇప్పటివరకు ఆర్థిక శాఖ నుంచి విడుదలైన నిధుల వివరాలతో ఒక నివేదిక ఇవ్వాలని పురపాలక శాఖ కార్యదర్శిని మంత్రి కె తారక రామారావు ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రావాల్సిన నిధులపైన ఆర్థిక శాఖ అధికారులతో త్వరలో సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న మౌలిక సదుపాయాల కల్పన పనుల సన్నాహాలతో పాటు పలు అభివృద్ధి పనులపై మంత్రి కేటీఆర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు.
నగరం నుంచి శివార్ల వరకు చేపట్టనున్న ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలను, వాటికి అవసరం అయిన నిధుల సేకరణ అంశాల మీద చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణానికి వివిధ ఏజెన్సీల నుంచి నిధుల సహకారానికి సూచనప్రాయంగా అంగీకారం లభించిందన్నారు. త్వరలో నాలాల పూడికతీత పనులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఎల్‌ఈడీలతో లైట్ల బిగింపు ప్రక్రియ ఈ ఉగాది నాటికి పూర్తి కావాలని సీడీయంఏ శ్రీదేవికి అదేశాలు జారీ చేశారు.
ప్రయోగాత్మకంగా తాగునీరు కార్యక్రమం
మెట్రో వాటర్ వరక్స్ ద్వారా ప్రయోగాత్మకంగా ప్రతి రోజు తాగు నీళ్లిచ్చే కార్యక్రమం ప్రణాళికలను మంత్రికి ఆ సంస్థ ఎండీ కిశోర్ వివరించారు. వారం పదిరోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రికి తెలిపారు. హెచ్‌ఎండీఏ తయారు చేస్తున్న మాస్టర్ ప్లాన్, మూసీ నది అథారిటీ ఏర్పాటుపైన మంత్రి సమీక్షించారు.ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, హెచ్‌ఎంఆర్ ,కమిషనర్లు, సీడీఎంఏ, మెట్రో వాటర్ వరక్స్ ఎం.డీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
బడ్జెట్‌కు పూర్తి వివరాలివ్వండి
Published Wed, Feb 1 2017 1:04 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM
Advertisement
Advertisement