నాలాకు దారి చూపిస్తాం! | Minister KTR comments on Naala's | Sakshi
Sakshi News home page

నాలాకు దారి చూపిస్తాం!

Published Sun, Sep 25 2016 2:56 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

నాలాకు దారి చూపిస్తాం! - Sakshi

నాలాకు దారి చూపిస్తాం!

పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు
- ఓ నలుగురిని పట్టి లోపలేస్తే పరిస్థితి మారుతుంది
- నాలాలపై 28 వేల అక్రమ కట్టడాలు..
- వరదల నివారణకు 390 కి.మీల మేర వరద కాల్వల అభివృద్ధి
- రూ.10 వేల కోట్లతో నాలాల అభివృద్ధి, పునరావాసం కల్పిస్తాం
 
 సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్ర రాజధానిలో కొత్తగా 390 కి.మీల వరద ప్రవాహ కాల్వలను విస్తరించి పునర్నిర్మించాలి. నాలాలపై 28 వేలకు పైగా అక్రమ కట్టడాలు ఉన్నాయని 2003-04లో వేసిన కిర్లోస్కర్ కమిటీ నివేదిక ఇచ్చింది. వీళ్లందరికీ పునరావాసం కల్పించి ఈ కాల్వలను నిర్మించేందుకు రూ.10 వేల కోట్లు అవసరం’ అని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. చెరువులు, నాలాలను కబ్జా చేసి విచ్చలవిడిగా నిర్మించిన కట్టడాలు నీటి ప్రవాహానికి అడ్డుగా మారడంతోనే వరదలు వచ్చాయని పేర్కొన్నారు. కొంత మంది కబ్జాదారులను అరెస్టు చేసి జైళ్లో వేస్తే ఈ జాడ్యం తగ్గుతుందని చెప్పారు. నాలాల విస్తరణపై అధ్యయనం కోసం జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ సురేంద్రమోహన్ నేతృత్వంలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల జాయింట్ కలెక్టర్లతో కమిటీ ఏర్పా టు చేశామన్నారు. ఈ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. సాధ్యమైన చోట నాలాల లోతు పెంచుతామని, లేని చోట విస్తరణ తప్పదన్నారు.

  జాగ్రత్తగా డీల్ చేస్తాం..
 ‘ప్రభుత్వం ముందు రెండు ప్రధాన సమస్యలున్నాయి. నాలాలపై నిర్మించిన శాశ్వత భవనాలు ఒకటైతే.. ఆ భూములకు కొందరు పట్టాలు సంపాదించి ఉండటం రెండోది. భూసేకరణ చట్టం-2013 వల్ల ఆ భూములను సేకరించడం ప్రభుత్వానికి తలకు మించిన భారం. కబ్జాదారులు కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకుంటుండటంతో చర్యలు తీసుకోలేకపోతున్నాం. న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ఏం చేయగలం? ప్రభుత్వానికి ఉన్న విశిష్ట అధికారాలు ఏమిటన్న అంశాలపై అడ్వకేట్ జనరల్ అభిప్రాయాన్ని తీసుకున్నాం. నాలాలపై అక్రమ కట్టడాలను కూల్చాలని 2011లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయి. ఎలాంటి నోటీసులు లేకుండా నాలాలపై అక్రమ కట్టడాలను కూల్చే అధికారాలు ప్రభుత్వానికి ఉన్నాయని జీహెచ్‌ఎంసీ చట్టం సెక్షన్ 11లోని 405వ అధ్యయనం పేర్కొంటోంది. మున్సిపాలిటీల చట్టంలో కూడా ఈ నిబంధన ఉంది. అయితే, పేద, దిగువ మధ్య తరగతి ప్రజలే అధికంగా ఉండటంతో జాగ్రత్తగా డీల్ చేస్తాం. అక్రమ భవనాలపై చర్యల కేసులను విచారించేందుకు టౌన్‌ప్లానింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం. ఈ నెల 26న జరిగే మంత్రివర్గ భేటీలో తీర్మానం చేస్తాం,’ అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని 93 శాతం నీరు నేరుగా మూసీలో కలుస్తాయని, భారీ భవనాలు అడ్డురావడంతో కాలనీలు జలమయం అయ్యాయని చెప్పారు.

 పరిశీలనలో సాంకేతిక పరిజ్ఞానం...
 ‘ఎగువ నుంచి లోతట్టు ప్రాంతాలకు ఎంత వరద రానుంది.. ఏ ప్రాంతాలు ముంపునకు గురవుతాయి.. ఏ మేరకు చర్యలు తీసుకోవాలన్న సమాచారం సేకరణకు ఐబీఎం, సీడాక్ సంస్థలు బ్రెజిల్‌లోని రియోలో నాలాలకు సెన్సార్లను బిగించి విజయవంతంగా పర్యవేక్షిస్తున్నాయి. అలాగే బార్సిలోనా నగరంలో 30 చోట్ల మూడంతస్తుల లోతు వరకు భూగర్భ నీటి జలాశయాలను నిర్మించి వరద నీటిని నిల్వ చేస్తున్నారు. హైదరాబాద్‌లో సైతం ఈ రెండు సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించి చూస్తాం. సల్ఫర్ డై ఆక్సైడ్ వాయువుతో భూగర్భ మురికి కాల్వ పైప్‌లైన్ కరిగిపోయి ట్యాంక్‌బండ్‌పై రోడ్డు కుంగిపోయింది. దీంతో నగరంలో భూగర్భ డ్రైనేజీ పైప్‌లైన్లపై అధ్యయనం కోసం ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్‌ను రప్పిస్తున్నాం’ అని వివరించారు.
 
 కబ్జాలతోనే భండారి లే అవుట్ ముంపు

 దిగువన ఉన్న ప్రగతి నగర్ చెరువులోకి వరద నీరు వెళ్లకుండా మధ్యలో భారీ కట్టడాలు నిర్మించడంతోనే భండారి లే అవుట్ కాలనీ ముంపునకు గురైందని కేటీఆర్ పేర్కొన్నారు. రోజుకు 2 సెంటీమీటర్ల వర్షాన్ని తట్టుకునే సామర్థ్యాన్ని హైదరాబాద్ కలిగి ఉందని, గురువారం ఒక్కరోజే 16 సె.మీలు, నాలుగు రోజుల్లో 30 సె.మీ.లకు పైగా వర్షం కురవడంతోనే నగరం ముంపునకు గురైందని చెప్పారు. ప్రభుత్వం సమర్థంగా ముందస్తు చర్యలు తీసుకోవడంతోనే ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement