సాక్షి, హైదరాబాద్: స్పెయిన్‌లో ఈ నెల 24న జరిగే ఫిక్కీ- ఐఫా గ్లోబల్ బిజినెస్ ఫోరం సమావేశంలో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి తారక రామారావుకు ఫిక్కీ నుంచి ఆహ్వానం అందింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్, సినిమా, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్, సంప్రదాయేతర ఇంధన వనరులు, పురపాలన, రహదారులు.. తది తర అంశాలపై ఈ ఫోరం వేదికగా చర్చలు నిర్వహిస్తారు.
ఐటీ, టూరిజం రంగాలకు సంబంధించి.. సినర్జీస్ ఇన్ ఐటీ, స్మార్ట్ సిటీ, టూరిజం ప్రమోషన్‌పై జరిగే చర్చలో ప్రసంగించాల్సిందిగా కేటీఆర్‌ను ఫిక్కీ వర్గాలు కోరాయి. కాగా జూలై 4న హైదరాబాద్‌లో జరిగే ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కూడా ప్రసంగించాల్సిందిగా కేటీఆర్‌ను ఆహ్వానించారు. ఫిక్కీ చైర్మన్ హర్షవర్ధన్ నియోటియా అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో వ్యాపారవేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు పాల్గొంటారని తెలంగాణ ఫిక్కీ చైర్మన్ సంగీతారెడ్డి తెలిపారు.