'కన్నా' తండ్రి సైకిళ్లకు పంక్చర్లు వేసుకునేవారు
హైదరాబాద్: తెలుగుదేశం ప్రభుత్వంపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు గురివింద గింజ తరహాలో ఉన్నాయని మంత్రి రావెల కిషోర్‌బాబు విమర్శించారు. బీజేపీ నేతలు సోము వీర్రాజు, కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు చేస్తున్న విమర్శలను వారి వ్యక్తిగతమైనవిగానే చూస్తాము తప్ప బీజేపీ అభిప్రాయంగా చూడలేమన్నారు. సచివాలయం మీడియా పాయింట్ వద్ద నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తండ్రి సైకిళ్లకు పంక్చర్లు వేసుకునేవారని, సైకిల్ దుకాణానికి యజమాని కొడుకు ఇప్పుడు వందల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి, సంక్షేమాల దిశగా దూసుకుపోతుంటే పనిలేని పార్టీలు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. భవిష్యత్తులోనూ రాష్ట్రంలో సింగిల్ పార్టీ.. అదీ సింగపూర్ తరహా పాలన కొనసాగుతుందని మంత్రి జోస్యం చెప్పారు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంపై ప్రశ్నించగా ప్రజల అభీష్టం మేరకే ఏపనైనా చేస్తామని.. బాక్సైట్ తవ్వకాల విషయంలో కూడా గిరిజనులకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు చేపట్టబోమని మంత్రి అన్నారు.