మంత్రివర్యులకు బల్దియా పరీక్ష | ministers take responsibilities for GHMC elections | Sakshi
Sakshi News home page

మంత్రివర్యులకు బల్దియా పరీక్ష

Published Mon, Jan 18 2016 1:42 AM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM

మంత్రివర్యులకు బల్దియా పరీక్ష - Sakshi

మంత్రివర్యులకు బల్దియా పరీక్ష

గ్రేటర్ హైదరాబాద్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవడమే లక్ష్యంగా...

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మంత్రులకు గెలుపు బాధ్యతలు
* ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేటీఆర్
* ఒక్కో మంత్రికి ఐదు డివిజన్ల బాధ్యతలు
* అక్కడే ప్రచారం.. నేతలతో సమన్వయం
* రెండు రోజులకోసారి పార్టీ అధినేతకు నివేదికలు
*ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకూ బాధ్యతలు
* తిరుగుబాటు అభ్యర్థులను రంగం నుంచి తప్పించేందుకు కసరత్తు
 సాక్షి ప్రత్యేక ప్రతినిధి
 గ్రేటర్ హైదరాబాద్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవడమే లక్ష్యంగా... మంత్రులందరినీ అధికార పార్టీ రంగంలోకి దించుతోంది. ఒక్కో మంత్రికి ఐదు నుంచి ఆరు డివిజన్ల ‘గెలుపు’ బాధ్యతలను అప్పగించింది. ఈ నెల 20వ తేదీ నుంచి ఎన్నికల పోలింగ్ జరిగే దాకా ప్రచారం నిర్వహించడం నుంచి నేతలను సమన్వయం చేసుకుని ముందుకెళ్లడం దాకా అన్ని పనులూ వారి చేతుల్లోనే పెట్టింది. మంత్రులకు తోడుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలనూ గోదాలోకి దించుతోంది.

‘గ్రేటర్’ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి కె.తారకరామారావు... జీహెచ్‌ఎంసీలోని మొత్తం 150 డివిజన్లలో 100 డివిజన్లకుపైగా గెలుచుకునే దిశగా వ్యూహాలను అమలు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీలో మెజారిటీ స్థానాలు గెలుచుకోవడంపైనే అధికార టీఆర్‌ఎస్ గురిపెట్టింది. ఎక్స్‌అఫీషియో సభ్యులపై ఆధారపడకుండా మొత్తం సీట్లలో సగానికంటే ఎక్కువగా గెలిపించే బాధ్యతను మంత్రులకు     అప్పగిస్తోంది. కేసీఆర్ తనయుడు, మంత్రి కె. తారకరామారావు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ముందుండి నడిపిస్తుండడంతో... సహజంగానే అధికార పార్టీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతోపాటు టీఆర్‌ఎస్ 80-85 డివిజన్లు గెలుచుకునే అవకాశం ఉందని సర్వేల్లో వెల్లడికావడంతో... ఆ పార్టీలో టికెట్ల కోసం పోటీ పెరిగింది. ఇతర పార్టీలకు చెందిన ధనిక నేతలు కూడా టీఆర్‌ఎస్ టికెట్ల కోసం క్యూ కట్టారు. తీరా నామినేషన్ల గడువు ముగిశాక చాలా డివిజన్లలో టీఆర్‌ఎస్ తిరుగుబాటు అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు నాయకత్వం గుర్తించింది. దీంతో ఎన్నికల షెడ్యుల్‌కు ముందున్న పరిస్థితిలో కొంత మార్పు ఉన్నట్లు గుర్తించి... పకడ్బందీ చర్యలు మొదలుపెట్టింది. అందులో భాగంగా మంత్రులతో పాటు ఎంపీలు, జిల్లాల్లోని ఎమ్మెల్యేలను కూడా రంగంలోకి దించింది. ఈ నెల 20వ తేదీ నుంచి ప్రచారం ముగిసే 31వ తేదీ దాకా హైదరాబాద్‌లో వారికి కేటాయించిన డివిజన్లలోనే బస చేయాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది.

 వంద డివిజన్లు టార్గెట్
 గ్రేటర్‌లో 150 డివిజన్లు ఉండగా అధికార పార్టీ 100 డివిజన్లలో గెలుపు లక్ష్యంగా పెట్టుకుంది. పాతబస్తీలో పోటీ నామమాత్రమే కావడంతో అక్కడి డివిజన్లను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇతర ప్రాంతాల్లో పార్టీ గుర్తించిన వంద డివిజన్లలో గెలుపు బాధ్యతలను మంత్రులకు అప్పగించబోతోంది. ఒక్కో మంత్రికి 5 నుంచి 6 డివిజన్లు అప్పగించడం దాదాపుగా ఖరారైంది. మంత్రులకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రచారంలోనూ, వ్యూహాల అమల్లోనూ సహకరిస్తారు. నామినేషన్ల ఘట్టం ముగిసిన నాటి నుంచి ప్రచార గడువు పూర్తయ్యేదాకా ఎమ్మెల్యేలు వారికి కేటాయించిన డివిజన్లలోనే బస చేయాల్సి ఉంటుంది.

మంత్రులు ఈనెల 20 నుంచి 31వ తేదీ దాకా వారికి కేటాయించిన డివిజన్లలో ప్రచారం నిర్వహించడంతో పాటు ప్రతి రెండు రోజులకోసారి పార్టీ అధినేతకు రహస్య నివేదిక ఇస్తారు. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వెంటనే సరిదిద్దేందుకు పార్టీ అధినేత ఏర్పాటు చేసిన కమిటీ రంగంలోకి దిగుతుంది. ఈ కమిటీలో సభ్యుల పేర్లు రహస్యంగా ఉంచుతారు. ‘మా టార్గెట్ వంద డివిజన్లు. మెజారిటీ కంటే ఐదు లేదా పది స్థానాలు ఎక్కువగా మేము సాధించబోతున్నాం’ అని సీనియర్ మంత్రి ఒకరు పేర్కొనడం గమనార్హం.

 కాలనీ అసోసియేషన్లు, సెటిలర్లతో భేటీలు..
 మున్సిపల్ ఎన్నికలకు కీలకమైన కాలనీ సంఘాలు, వెల్ఫేర్ అసోసియేషన్లతో పాటు సెటిలర్లతో టీఆర్‌ఎస్ నేతలు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించబోతున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకునే కార్యక్రమం ఇప్పటికే సగానికిపైగా పూర్తయింది. ఆయా కాలనీల్లో సమస్యలు గుర్తించిన తరువాత నేరుగా మంత్రులే కాలనీ అసోసియేషన్లతో సమావేశమై.. వాటి పరిష్కారానికి హామీ ఇస్తారు. ‘‘అధికారంలో ఉన్నాం కాబట్టి సమస్యలు తెలుసుకోవడం తప్పు కాదు. ఇంత కాలం పరిష్కారం కాని సమస్యలపై మేం హామీ ఇవ్వడం కూడా తప్పు కాదు..’ అని రాష్ట్ర మంత్రి ఒకరు చెప్పారు. అలాగే కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ వాళ్లు హామీ ఇచ్చినా తమకేం అభ్యంతరం లేదని... ఎవరు సమస్యలు పరిష్కరించగలరో ప్రజలకు తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన 18 మాసాల కాలంలో సెటిలర్లలో ఉన్న అన్నిరకాల భయాలను పోగొట్టగలిగామని టీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. కాలనీల్లో సెటిలర్లతో సమావేశాలు నిర్వహించి తెలంగాణలో ఉంటున్న వారిని సెటిలర్లుగా కాకుండా స్థానికులుగానే గుర్తిస్తామని భరోసా ఇస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement