సినీకార్మికులపై వరాల జల్లు
-చిత్రపురి కాలనీలో మంత్రుల పర్యటన
హైదరాబాద్
సినీ కార్మికులపై రాష్ట్ర మంత్రులు వరాల జల్లు కురిపించారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో వారడిన కోరికలన్నింటినీ అక్కడికక్కడే ఓకే చెప్పేశారు. రాజేంద్రనగర్ మండలం మణికొండ పంచాయతీ చిత్రపురికాలనీలో ఐటీ మంత్రి కె.తారకరామారావు, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, రవాణా శాఖమంత్రి పి.మహేందర్‌రెడ్డి పర్యటించారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు వారి దృష్టికి తెచ్చిన కాలనీ ప్రధానరోడ్డు నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ, పంచాయతీరాజ్ శాఖనుంచి రూ. కోటిన్నర నిధులను ఖర్చుచేయనున్నట్టు ప్రకటించారు. అలాగే, పట్టణ ఆరోగ్యకేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు. కాలనీకి రేపటి నుంచి బస్‌లను నడుపుతామని హామీ ఇచ్చారు.
కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్‌లు తీసుకోవచ్చని కళాకారుల పింఛన్‌లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు. తాము15వేల మంది ఉండగా కేవలం 4 వేలమందికే గృహాలు ఇచ్చారనీ.. మిగతా వారికి పక్కనే ఉన్న మరో 9ఎకరాల భూమిని కేటాయించాలని కోరటంతో ముఖ్యమంత్రితో చర్చించి కేటాయిస్తామని హామి ఇచ్చారు.
కాలనీకి ఉచిత వైఫై సేవలను అందించాలని కళాకారులు కోరారు.. దీనికి మంత్రి కేటీఆర్ సమాధానం ఇస్తూ.. త్వరలోనే వైఫై సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తెలుగు సినిమారంగాన్ని దేశానికే తలమానికంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఈ సందర్భగా ఆయన ప్రకటించారు. ప్రపంచంలోనే పేరెన్నికగన్న సంస్థలు హైదరాబాద్‌కు వస్తున్నాయన్నారు.