తాగడానికి నకిలీ లైసెన్సు!
బంజారాహిల్స్: నకిలీ గుర్తింపు కార్డుతో ఒక యువకుడు బార్‌లోకి ప్రవేశించి మద్యం తాగుతుండగా ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ -10లోని ఎమ్మెల్యే, ఎంపీల కాలనీలో నివసించే విశేష్ అగర్వాల్ (19) ఢిల్లీలోని ఓ ప్రభుత్వ కళాశాలలో బీఏ చదువుతున్నాడు. వారం క్రితం నగరానికి వచ్చాడు. ఎక్సైజ్ పోలీసులు, పోలీసులు గత మూడు రోజుల నుంచి అన్ని పబ్‌లు, బార్లలో విస్తృతంగా తనిఖీలు చేస్తూ 21 ఏళ్లలోపు యువకులకు ప్రవేశం కల్పించరాదంటూ స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. మంగళవారం రాత్రి విశేష్ అగర్వాల్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-45లోని గ్లోకల్ బార్ అండ్ రెస్టారెంట్‌కు వెళ్లి తన డ్రైవింగ్ లైసెన్స్‌ను చూపించి లోనికి వెళ్లాడు. ఆ డ్రైవింగ్ లైసెన్స్‌పై పుట్టిన సంవత్సరం 1994 అని ఉండటంతో బౌన్సర్లు అనుమతించారు.
సరిగ్గా రాత్రి 10 గంటలకు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రావు తన సిబ్బందితో కలిసి గ్లోకల్ బార్‌లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విశేష్ అగర్వాల్ వద్ద గుర్తింపు కార్డు తనిఖీ చేయగా దానిపై పుట్టిన సంవత్సరం 1997 అని ఉంది. ఎలా అనుమతించారని బార్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా 1994 పుట్టినతేదీతో డ్రైవింగ్ లైసెన్స్ చూపించాడని చెప్పగా పోలీసులు తనిఖీలు చేయగా అతడి వద్ద రెండు డ్రైవింగ్ లైసెన్స్‌లు ఉన్నట్లు తేలింది. అసలు డ్రైవింగ్ లైసెన్స్‌పై ఉన్న 1997ను 1994గా మార్ఫింగ్ చేయించి నకిలీ ఐడీ కార్డుతో లోనికి ప్రవేశించినట్లు విశేష్ అగర్వాల్ ఒప్పుకొన్నాడు. మోసం చేసినందుకు అతనిపై జూబ్లీహిల్స్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 420, 468, 471 కింద కేసు నమోదు చేసి బుధవారం అరెస్టు చేశారు.