కరప్షన్‌కు కన్నబిడ్డ... కమీషన్లకు ముద్దుబిడ్డ | Mla Roja fires in cm chandrababu | Sakshi
Sakshi News home page

కరప్షన్‌కు కన్నబిడ్డ... కమీషన్లకు ముద్దుబిడ్డ

Published Sat, Oct 15 2016 1:22 AM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

కరప్షన్‌కు కన్నబిడ్డ... కమీషన్లకు ముద్దుబిడ్డ - Sakshi

కరప్షన్‌కు కన్నబిడ్డ... కమీషన్లకు ముద్దుబిడ్డ

 - సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా మండిపాటు
 - ప్రజల భవిష్యత్తును భూస్థాపితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు
 - ఆయన ఏపీలో పుట్టినందుకు మనమంతా సిగ్గుపడాలి
 - కుటుంబ సభ్యుల ఆస్తులపై సీబీఐ విచారణకు బాబు సిద్ధమా?
 - లోకేశ్ సిమ్‌కార్డు లేని సెల్‌ఫోన్ లాంటివాడు
 
 సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో పుట్టినందుకు మనమంతా సిగ్గుపడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. చంద్రబాబు గురించి నాలుగు మాటల్లో చెప్పాలంటే ‘‘బ్లాక్‌మనీకి బ్రాండ్ అంబాసిడర్, చీటింగ్‌కు ఛీర్‌గాళ్, కరప్షన్‌కు కన్నబిడ్డ, కమీషన్లకు ముద్దుబిడ్డ’’ అని ఘాటుగా విమర్శించారు. రోజా శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అవినీతి కేసుల నుంచి తప్పించుకునేందుకు ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వానికి, నదులను తెలంగాణకు తాకట్టు పెట్టిన మోసకారి చంద్రబాబు అని నిప్పులు చెరిగారు. నల్లధనం విషయంలో నిజంగా తప్పు చేయకపోయి ఉంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించుకునే ధైర్యం ఉందా? అని చంద్రబాబుకు సవాల్ విసిరారు.

తెలుగు ప్రజల భవిష్యత్తును భూస్థాపితం చేసేందుకు ప్రయత్నిస్తున్న బాబును తరిమేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబుపై వస్తున్న ఆరోపణల్లో కనీసం ఒక్కదానిపై సీబీఐ విచారణ జరిగినా ఆయన జీవితాంతం జైల్లో కూర్చొవాల్సిన పరిస్థితి ఎదురవుతుందన్నారు. చంద్రబాబు నిజంగా ఎలాంటి అవినీతికి పాల్పడకపోతే తన భార్య, కొడుకు, కోడలి పేరిట ఉన్న ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించేందుకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని రోజా నిలదీశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏ తప్పూ చేయలేదు కాబట్టి కోర్టు నుంచి ఎలాంటి స్టేలు తెచ్చుకోకుండా దమ్మున్న నాయకుడిగా నిలబడ్డారని అన్నారు. బాబు రాయలసీమ గడ్డమీద పుట్టి ఉంటే జగన్‌పై చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. నిజంగా వారి దగ్గరఆధారాలుంటే వాటిని ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు.

 బాబు ఎక్కడ నుంచి వచ్చారో..
 ‘‘రాజధాని నిర్మాణాన్ని తెలుగువారికి అప్పగిస్తే మురికివాడలు కడతారని అంటున్న చంద్రబాబు తాను రెండెకరాల స్థాయి నుంచే వచ్చానన్న విషయం మర్చిపోతున్నారు. ప్రపంచ దేశాల్లో తెలుగువాళ్లు గొప్పగొప్ప కట్టడాలు కడుతున్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు కించపర్చడం ఎంతవరకు సమంజసం? ఆయనకు విదేశాలపై మోజు ఉంది కాబట్టే రాజధానిని నిర్మించుకొని, 30 సంవత్సరాలు అమ్ముకునే అవకాశాన్ని సింగపూర్‌కు ఇచ్చారు. ఎకానమిక్స్‌లో పీహెచ్‌డీ చేశానని బాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు, వింతగా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయనకు వెంటనే మానసిక చికిత్స చేయించాలి’’ అని రోజా సూచించారు.

 ఆ నాయుళ్లు అవిభక్త కవలలు
 ‘‘కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, తాను అమెరికాలో పుట్టి ఉండాల్సిందని చంద్రబాబు వ్యాఖ్యానించడం దారుణం. వెంకయ్య, బాబు అవిభక్త కవలలు అని చెప్పడానికి ఇంతకన్నా మరో నిదర్శనం లేదు.బాబుకు తల్లిదండ్రులు, రాజకీయ భిక్ష పెట్టిన కుప్పం, ప్రాణాలు కాపాడిన తిరుపతి వెంకన్నస్వామి గుర్తుకు రాలేదు, వెంకయ్య మాత్రమే గుర్తుకు రావడంలో ఆంతర్యం ఏమిటి? రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడంలో ఒకరికొకరు తోడుగా ఉంటున్నారు. దేశ ద్రోహానికి పాల్పడిన చంద్రబాబు తక్షణమే రాజీమానా చేయాలి. ఇలాంటి వ్యక్తి సీఎంగా కొనసాగేందుకు అర్హుడు కాదు. భారతీయులను అవమానించినందుకు దేశ పౌరులందరికీ చంద్రబాబు క్షమాపణ చెప్పి, భరతమాత కాళ్లు పట్టుకోవాలి’’ అని రోజా డిమాండ్ చేశారు.
 
 దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
 ‘‘నరేంద్ర మోదీ, చంద్రబాబు , పవన్ కల్యాణ్ కలిసి వచ్చినా ఒంటరిగా ఎన్నికల బరిలో నిలబడిన దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్న విషయం నారా లోకేశ్‌బాబు తెలుసుకోవాలి. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని లోకేశ్ అడ్డదారిలో మంత్రి కావాలని చూస్తున్నాడు. మండల కమిటీని ఎలా నియమిస్తారో కూడా తెలియని వ్యక్తి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కావడం తెలుగు తమ్ముళ్లు చేసుకున్న దురదృష్టం. అలాంటి లోకేశ్... వైఎస్ జగన్‌కు పోటీ అనడం హాస్యాస్పదం. వాస్తవానికి లోకేశ్ సిమ్‌కార్డు లేని సెల్‌ఫోన్ లాంటివాడు. బిల్డప్‌లు ఎక్కువ బిజినెస్ తక్కువ. పబ్లిసిటీ ఎక్కువ పెర్ఫార్మెన్స్ తక్కువ. బాబు తన అవినీతి భాగోతం నుంచి బయట పడేందుకు తన పెంపుడు రాజకీయ నేత దేవినేని ఉమాను ఉసిగొల్పుతున్నారు. అసలు ఉమా అంటే ఆడా, మగో తెలియడం లేదు’’ అని రోజా ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement