'మూల్యం చెల్లించుకోక తప్పదు'
విజయవాడ: చట్ట సభల్లో ఉన్న మహిళలకే రక్షణ లేకపోతే ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏంటి అని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మహిళా పార్లమెంట్ సదస్సుకు రోజాను ఎందుకు ఆహ్వనించినట్లు.. ఎందుకు నిర్బంధించినట్లు అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు ఆదేశానుసారమే రోజాను నిర్భంధించారన్న ఆమె.. ఇది ప్రజాస్వామ్యమా? నియంతపాలనా? అని మండిపడ్డారు.
ప్రజల సొమ్ముతో మహిళా పార్లమెంట్ సదస్సును నిర్వహిస్తూ.. ఒక శాసన సభ్యురాలిని ఎందుకు అనుమతించలేదని గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు. ఇటీవల ప్రతిపక్షనేత వైఎస్ జగన్ విషయంలోనూ ప్రభుత్వం ఇలాగే వ్యవహరించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. మహిళా పార్లమెంట్ సదస్సు కమిటీలో రోజా సభ్యురాలుగా ఉన్నారని తెలిపిన ఆమె.. ప్రజలు అంతా గమనిస్తున్నారని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.