మోడల్‌పై లైంగిక దాడి
సిటీలో ఘాతుకం
*న్యూ ఇయర్ ఈవెంట్‌కు పిలిచి..
*శివార్లలోని ఓ ఇంట్లో నిర్బంధించి అఘాయిత్యం
*ఆలస్యంగా వెలుగు చూసిన ఘోరం
*కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు
*దర్యాప్తు కోసం సిటీకి రానున్న బృందం
సాక్షి, సిటీబ్యూరో : కఠిన చట్టాలు కొరడా ఝళిపిస్తున్నా.. ప్రజాసంఘాల ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నా.. మహిళలపై అకృత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. నిర్భయ, అభయ ఘటనల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న నగరంలో కొత్త ఏడాది తొలిరేజే మరో ఘోరం జరిగింది. ముంబై మోడల్‌పై సామూహిక లైంగికదాడి జరిగింది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి న్యూ ఇయర్ ఈవెంట్ అంటూ పిలిచిన దుండగులు మత్తు మందు ఇచ్చి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. పూర్తిగా మామూలు స్థితికి రాని ఆమెను ప్రైవేట్ బస్సులో ముంబై పంపించేశారు.
అక్కడకు చేరుకున్న బాధితురాలు జన్‌శక్తి ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో మంగళవారం మహారాష్ట్రలోని వెర్సోవా ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలికి బుధవారం అక్కడి ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కేసు దర్యాప్తుతో పాటు నిందితుల్ని పట్టుకోవడం కోసం ప్రత్యేక పోలీసు బృందం మరో రెండు రోజుల్లో హైదరాబాద్‌కు రానుంది. జన్‌శక్తి ఫౌండేషన్ అధ్యక్షుడు జై శంకర్ సింగ్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఫోన్ ద్వారా ‘సాక్షి’కి తెలిపారు. ఆ వివరాలివీ...
ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్ జిల్లా రిహాథి ప్రాంతానికి చెందిన ఓ యువతి ముంబైలోని వెర్సోవాలో స్థిరపడింది. మోడల్‌గా పని చేస్తున్న ఈమె గతంలో కొన్ని ఈవెంట్స్, యాడ్స్‌తో పాటు చిత్రాల్లోనూ నటించింది. డిసెంబర్ 31న మధ్యాహ్నం హైదరాబాద్‌కు చెందిన హ్యాపీ అనే వ్యక్తి ఈమెకు ఫోన్ చేశాడు. ‘న్యూ ఇయర్’ ఈవెంట్‌లో పాల్గొనాలని, నిర్వాహకులు రూ.లక్ష పారితోషికం ఇస్తారని చెప్పాడు. తనకు కమీషన్‌గా రూ.25 వేలు ఇవ్వాలంటూ ఒప్పందం కుదుర్చుకున్నాడు.
గతంలోనూ హ్యాపీ కొన్నిసార్లు ఈ మోడల్‌తో సంప్రదింపులు జరిపి ఉండటంతో ఆమె తేలిగ్గా నమ్మి రావడానికి అంగీకరించింది. దీంతో అదేరోజు మధ్యాహ్నం 3.10 గంటలకు ముంబై నుంచి హైదరాబాద్ రానున్న ఇండిగో ఫ్లైట్‌లో రెండో నెంబర్ సీట్‌ను బుక్ చేసిన హ్యాపీ.. టికెట్ వివరాలు ఆమెకు పంపాడు. అదే ఫ్లైట్ ఎక్కిన మోడల్ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని హ్యాపీని సంప్రదించింది. మరో అర్ధగంటకు సిల్వర్ కలర్ కారులో వచ్చిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు హ్యాపీ పంపాడని చెప్పి మోడల్‌ను తమ కారులో ఎక్కించుకుని ఈవెంట్ అంశాలు ఆమెకు వివరిస్తూ బయలుదేరారు.
కొద్దిదూరం ప్రయాణించిన తరవాత మరో కారులోకి మారే సందర్భంలో మోడల్‌తో పాటు ముగ్గురే ఎక్కారు. అక్కడ నుంచి దాదాపు రెండు గంటలు ప్రయాణించిన తరవాత ఓ ప్రాంతంలోని ఇంటి వద్దకు కారును తీసుకువెళ్లారు. ఆ ఇంటి ముందు ఓ మహిళ ముగ్గు వేస్తున్నట్లు మోడల్ గమనించింది. ఇంట్లోకి వెళ్లిన తరవాత మోడల్‌తో పాటు ఒక వ్యక్తిని అక్కడే ఉంచిన మిగిలిన ఇద్దరు వ్యక్తులు టెర్రాస్ పైకి వెళ్లి సిగరెట్ కాల్చుకుని వస్తామని చెప్పి బయటకు వచ్చారు. తనతో ఉన్న వ్యక్తితో సదరు మోడల్ దాహం వేస్తోందని చెప్పడంతో అతడు కూల్‌డ్రింక్ ఇచ్చాడు. అది తాగిన బాధితురాలు అపస్మారక స్థితిలోకి చేరుకుంది.
బోరోవాలీలో తేరుకున్న బాధితురాలు
అపస్మారకస్థితిలో ఉన్న మోడల్‌పై ముగ్గురు వ్యక్తులూ 24 గంటలకు పైగా సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలను సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. జనవరి ఒకటో తేదీ రాత్రి వరకు ఈ ఘాతుకం కొనసాగింది. ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలను సైతం దోచుకున్న దుండగులు.. ఏటీఎం కార్డును వినియోగించి రూ.55 వేలు స్వాహా చేశారు. ఒకటో తేదీ రాత్రికీ పూర్తిగా స్పృహలోకి రాని ఆమెను ప్రైవేట్ బస్సులో ఎక్కించి ముంబైకి పంపించేశారు.
జనవరి రెండో తేదీ మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో బస్సు మహారాష్ట్రలోని బోరోవాలీలో ఉన్న చివరి స్టాప్‌కు వెళ్లినప్పటికీ మోడల్ దిగలేదు. ఆమె మగతలో ఉండటం గుర్తించిన కొందరు ప్రయాణికులు సపర్యలు చేసి ఆమెకు పూర్తి స్పృహ తెప్పించారు. దీంతో తేరుకున్న బాధితురాలు వారి సహకారంతోనే వెర్సోవాలోని తన ఇంటికి వెళ్లింది. పూర్తిగా కోలుకున్న తరవాత నేరుగా వెర్సోవా పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
దీన్ని స్వీకరించేందుకు పోలీసులు నిరాకరించడంతో అదే ప్రాంతంలో నివసిస్తున్న తన సమీప బంధువు స్నేహితురాలు సోనాల్‌తో కలిసి మరోసారి ఠాణాకు వెళ్లి ఫ్లైట్ టిక్కెట్ నెంబర్ వివరాలతో పాటు తిరుగు ప్రయాణినికి సంబంధించిన ప్రైవేట్ బస్సు టిక్కెట్‌ను సమర్పించినా అధికారులు స్పందించలేదు. దీంతో వీరిరువురూ అక్కడి జన్‌శక్తి ఫౌండేషన్ అధ్యక్షుడు జై శంకర్ సింగ్ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లారు.
చొరవ తీసుకున్న ఆయన మంగళవారం అంధేరీలోని డీఎన్ నగర్ డివిజన్ ఏసీపీకి ఫిర్యాదు చేయడంతో స్పందించిన వెర్సోవా పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి వాంగ్మూలం రికార్డు చేసుకున్న పోలీసులు బుధవారం రాత్రి అంధేరీలోని కూపర్ హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక దర్యాప్తు పూర్తయిన తరవాత ఉదంతం ఏ ప్రాంతంలో చోటు చేసుకుందో గుర్తించాలని నిర్ణయించిన వెర్సోవా పోలీసులు.. అవసరమైతే కేసును హైదరాబాద్‌కు బదిలీ చేయాలని యోచిస్తున్నారు.