విద్యుదాఘాతంతో తల్లీకొడుకుల మృతి
♦ వాషింగ్‌మెషీన్ ఎలక్ట్రిక్ వైర్‌ను ఎలుకలు కొరకడంతో కరెంట్ షాక్
♦ తాడుతో మంచానికి కట్టేయడంతో ప్రాణాలతో బయటపడ్డ చిన్నారి
హైదరాబాద్: వాషింగ్ మెిషీన్‌లో బట్టలు ఉతుకుతుం డగా విద్యుదాఘాతానికి గురై తల్లీకొడుకులు మృతి చెందారు. సికింద్రాబాద్ అంబర్‌నగర్‌కు చెందిన ఎంఏ సఫీయుద్ధీన్ కుమార్తె హలీమున్నీసా(25)కు ముషీరాబాద్‌కు చెందిన ఆశ్రఫ్‌ఖాన్‌తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు జునైద్‌రెహమాన్(03), కుమార్తె సమ్రిన్(15 నెలలు) ఉన్నారు. కొంతకాలంగా వారాసిగూడలో నివసిస్తున్నారు. శుక్రవారం హలీమున్నీసా ఇంట్లోని వాషింగ్‌మెషీన్‌లో బట్టలు వేసి స్విచ్ఛాన్ చేసింది. మెషీన్ నుంచి వచ్చే వృథా నీరు అడుగు ఎత్తున అక్కడే నిలిచిపోయింది.
వాషింగ్‌మెషీన్‌కు విద్యుత్ సరఫరా చేసే వైరును ఎలుకలు కొరికివేయడంతో రాగితీగలు ద్వారా నీటిలోకి విద్యుత్ సరఫరా అయింది. దీన్ని గమనించని హలీమున్నీషా నీటిలో కాలుపెట్టడంతో విద్యుదాఘాతానికి గురైంది. అక్కడే ఉన్న జునైద్‌రెహమాన్.. ఆమెను పట్టుకోవడంతో బాబు కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అలాగే గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలారు. కొద్దిసేపటి తర్వాత స్థానికంగా ఉండే బంధువు పర్వేజ్ వచ్చి చూసేసరికి తల్లీకొడుకులు కిందపడి ఉన్నారు.
చిన్నారి సమ్రిన్ ఏడుస్తోంది. అదేప్రాంతం లో ఉంటున్న మృతురాలి తండ్రికి సమాచారం అందించడంతో అతను వచ్చి విద్యుత్ సరఫరాను నిలిపివేశాడు. 15 నెలల సమ్రిన్ ఇల్లంతా తిరుగుతూ అల్లరి చేస్తోందని తాడుతో మంచానికి కట్టివేయడంతో ప్రాణాలతో బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీం ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. నాసిరకం వాషింగ్‌మెషీన్ వాడడం, వైరును ఎలుకలు కొరికివేయడంతో విద్యుదాఘాతానికి గురై తల్లీకొడుకులు మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా తన కుమార్తెను అల్లుడు అశ్రఫ్‌ఖాన్ కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడని, 4 నెలల క్రితం జమాత్‌కు వెళ్లి ఈనెల 14న వచ్చి, భార్యతో గొడవపడి చేగుంట వెళ్లిపోయాడని, మరుసటి రోజే ఈ ఘటన జరిగిందని, విచారణ చేపట్టాలని మృతురాలి తండ్రి ఎంఏ సఫియుద్దీన్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.