
కేసీఆర్ పాలనపై ప్రజలు తిరగబడుతున్నారు
మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు అండగా ఉంటాం: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలపై ప్రజలు తిరగబడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల హక్కులకోసం జరుగుతున్న పోరా టానికి అండగా ఉంటామని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో ప్రకటించారు. చట్ట ప్రకారం భూసేకరణ చేయకుండా ప్రభుత్వమే రియల్‌ఎస్టేట్ బ్రోకరులాగా రైతులను బెది రించి భూములను బలవంతంగా కొనుగోలు చేస్తున్నదని విమర్శించారు.
మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులు వేములఘాట్ గ్రామంలో ఏడాదిగా చేస్తున్న పోరాటానికి అభినందనలు తెలిపారు. దేశంలోనే వేములఘాట్ రైతుల పోరాటం చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. భూమిపై రైతులకు హక్కులు లేకుండా చేయడం దుర్మార్గమైన చర్య అని ఉత్తమ్ విమర్శించారు. భూములు కోల్పోయే రైతులు కోరుకున్న విధంగా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
చేతకానితనంతో కేటీఆర్ విమర్శలు: మల్లు రవి
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం చేతకాని మంత్రి కేటీఆర్ నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రజా గర్జనసభలో మాట్లాడిన రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజల మనసులోని మాటలను బయట పెట్టారని తెలిపారు. దేశంకోసం ప్రాణాలను త్యాగం చేసిన గాంధీ కుటుంబానికి, పదవులకోసం దిగజారే సీఎం కేసీఆర్ కుటుంబానికి పోలికేలేదన్నారు.