
‘గడ్డం గురించి కాదు..అవినీతిపై మాట్లాడాలి’
హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి గడ్డం గురించి కాకుండా గ్రేటర్ హైదరాబాద్‌లో జరిగిన అవినీతి గురించి చెప్పాలని మంత్రి కేటీఆర్‌కు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి సూచించారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ కేటీఆర్ వ్యాఖ్యలు అహంకారానికి, అధికార మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేయాలనే సంకల్పంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి పనిచేస్తున్నారని, కించపరిచేవిధంగా మాట్లాడటం కేటీఆర్‌కు తగదని మల్లు రవి వ్యాఖ్యానించారు.
ప్రజాధనంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కులు చెల్లించుకుంటున్నారని విమర్శించారు. ప్రజా సొమ్మును దుర్వినియోగం చేయకుండా కేవలం తన గడ్డం మాత్రమే ఉత్తమ్ పెంచుకుంటున్నారని చెప్పారు. అవినీతికి పాల్పడితే కుటుంబ సభ్యులైనా సహించబోనని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ ఇప్పుడే చేస్తున్నారని, గ్రేటర్ హైదరాబాద్‌లో జరిగిన 300 కోట్ల కుంభకోణం గురించి ఎందుకు మాట్లాడటం లేదని మల్లు రవి ప్రశ్నించారు.