నీకు బీపీ వస్తే.. నీ పీఏ వణుకుతాడేమో.. నాకు బీపీ వస్తే.. ఏపీ మొత్తం వణుకుద్ది.. ఇలా బీపీ మీద సినిమాల్లో బోలెడన్ని డైలాగులు.. ఈ బీపీ అన్నది మనలోనూ.. మన సినిమాల్లోనూ ఓ భాగమైపోయింది. ఎవడికైనా కోపం ఎక్కువైతే.. వాడికి బీపీ ఎక్కువరా అనేస్తాం.. ఇంతకీ ఇప్పుడీ బీపీ బాగోతం మనకెందుకంటే.. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2015–16లో దేశంలోని రక్తపోటు బాధితుల లెక్కలను తీశారు. తొలిసారిగా ఈ సర్వేలో వీరి సంఖ్యను గణించారు. పలురకాల కోణాల్లో దాన్ని విశ్లేషించారు కూడా.. దీని ప్రకారం సంపన్న వర్గాల్లో బీపీ ఎక్కువట.. ఇక్కడ మహిళల్లో 13 శాతం మందికి.. పురుషుల్లో 18 శాతం మందికి బీపీ ఉంది.
దేశ సగటుతో పోలిస్తే.. ఇది ఎక్కువ. దేశంలోని పురుషుల్లో 15 శాతం మందికి బీపీ ఉండగా.. మహిళల్లో అది 11%. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని పురుషుల్లో 14 శాతం మంది రక్తపోటుతో బాధపడుతుండగా.. పట్టణాలకొచ్చేసరికి అది కాస్త పెరిగి 17 శాతంగా ఉంది. మహిళల్లో ఇది గ్రామాల్లో 10%, పట్టణాల్లో 12 శాతంగా ఉంది. రాష్ట్రాల పరంగా చూస్తే.. అత్యధికంగా సిక్కింలో 31 శాతం మంది మగవారు రక్తపోటుతో బాధపడుతున్నారు. అదే అతివల విషయానికొస్తే..సిక్కిం, అస్సాంలో 18 శాతం మంది బీపీ బాధితులేనట. తెలంగాణలో 20% , ఏపీలో 18 శాతం పురుషులకు బీపీ ఉంటే.. రెండు రాష్ట్రాల్లోని మహిళల్లో అది 13 శాతంగా ఉంది. వీటితోపాటు మతాలవారీగా కూడా రక్తపోటు బాధితుల లెక్కలేశారు. దీని ప్రకారం సిక్కుల్లో బీపీ ఎక్కువని తేల్చారు. గుండెపోటు వంటి హృదయ సంబంధిత మరణాల్లో 50 శాతం వాటికి కారణం ఈ రక్తపోటేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న సంగతి తెలిసిందే.
– సాక్షి, తెలంగాణ డెస్క్
హలో మాస్టారూ..మీకు బీపీ ఉందా?
Published Wed, Jan 24 2018 3:04 AM | Last Updated on Wed, Jan 24 2018 3:04 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment