నేటివిటీ మిస్
ఈయన పేరు.. అల్‌రిచ్ గ్రౌట్.. సైంటిఫిక్ అడ్వయిజర్ నుంచి బెర్లిన్ మేయర్‌గా ఎదిగారు. మెట్రోపొలిస్ సదస్సులో ‘సస్టెయినబుల్ సిటీ’పై ప్రసంగిస్తున్నారు. 28 ఏళ్ల కిందట మధురై నుంచి ఢిల్లీకి వెళ్తూ హైదరాబాద్ విజిట్ చేశారు. అప్పటి, ఇప్పటి సిటీ నేటివిటీ గురించి సిటీప్లస్‌తో పంచుకున్నారు.
నాడు పచ్చటి ఉద్యానవనాలు.. విశాలమైన భూభాగం.. ఈ నగరానికే సొంతమైన శిలలతో భలే అందంగా ఉండేది. ఇప్పుడు చూస్తే ఆశ్చర్యం.. విస్మయం. ఆ ల్యాండ్‌స్కేప్‌లు లేవు. ఆ కొండలూ లేవు. ఎక్కడపడితే అక్కడ అపార్ట్‌మెంట్లు, ఫ్లైఓవర్స్.. ఇవి విశాల నగరాన్ని మింగేశాయి. అప్పట్లో సిటీలో నో పెప్సీ.. నో కోకాకోలా.. తాజా పండ్లతో తయారు చేసిచ్చే జ్యూస్ భలే రుచిగా ఉండేది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నాకో విచిత్రంగా కనిపించింది. అక్కడి నుంచి నోవాటెల్ హోటల్ వరకూ ఉన్న రోడ్స్ ఇంకా వండర్. ఈ అభివృద్ధి అహేతుకమైందంటాను. సహజ సంపదను, అందాన్ని హరించిన ఈ డెవలప్‌మెంట్ అంత మంచిదికాదని నా ఉద్దేశం. సరైన టౌన్‌ప్లాన్ ఉన్నట్టు అనిపించడం లేదు.
కంఫర్ట్ ఫస్ట్..
నగరాలు పెరుగుతున్నపుడు కొన్ని తప్పిదాలు సహజం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ పునఃనిర్మాణంలో మా దేశం కూడా ఇలాంటి పొరపాట్లే చేసింది. వాటిలో ఒకటి.. కార్లు వెళ్లడానికి అనువుగా మాత్రమే మేం నగరాలను నిర్మించుకోవడం.. 24 గంటలూ కార్లలో తిరగలేం కదా? అందుకే అలాంటి మోడల్ సిటీస్ అంత సజెస్టబుల్ కాదు. జనాలు ఎక్కడ కంఫర్ట్‌గా ఫీలవుతారో అక్కడే ప్లాన్డ్ సిటీలు నిర్మించుకోవాలి.
ఉనికి కాపాడుకోవాలి..
గ్లోబలైజేషన్ తర్వాత అభివృద్ధి వేగవంతమైంది. ఎకాన మీ ప్రెషర్స్ పెరిగాయి. వీటిని సమన్వయం చేస్తూనే నగరాల సహజత్వాన్ని కాపాడుకోవాలి. హైదరాబాద్ విశాలమైన నగరం. దీనికి ఇంకా ఆకాశాన్నంటే మేడలు అవసరం లేదు. చక్కటి సరస్సులు, కొండలు, గ్రీనరీ ఇవే సిటీ వాతావరణాన్ని కాపాడే ఆయుధాలు. అభివృద్ధి పేరుతో వాటిని హరించడం బాధాకరం. పెరుగుతున్న జనాభా, వారి అవసరాల మీద ఎంత దృష్టి పెడతామో.. సిటీ ఉనికి మీద అదే దృష్టి అవసరం. ఇండియాలోని ప్రధాన నగరాల్లో ఎక్కడ చూసినా.. అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లే. అవీ రోడ్డును ఆనుకుని కనిపిస్తాయి. గాలి వెలుతురు లేని ఇరుకు గదులు.. వాహనాల రణగొణధ్వనులు.. కాలుష్యంలో బతుకీడుస్తున్నారు. సిటీప్లాన్ అంటే కాన్ఫరెన్స్ హాల్స్, మల్టీప్లెక్స్‌లే కాదు.. సామాన్యుడు ప్రశాంతంగా ఉండే ఇల్లు, వాతావరణం ఉండాలి. అలాంటి సిటీల నిర్మాణానికి కావల్సిన సూచనలు, సలహాలు ఫైల్స్‌లో బైండ్ కాకూడదు. ప్రాక్టికల్ ట్రూత్స్‌గా నిలబడాలి. అప్పుడే ఇలాంటి సదస్సులకు అసలైన అర్థం.
అయినా ఆదాబ్ హైదరాబాద్..
హైదరాబాద్ విషయంలో.. మౌలిక సదుపాయాలు ఇన్‌క్లూడింగ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ ఆర్ గుడ్. కానీ ఈ సిటీ అభివృద్ధి అన్ ఈవెన్‌గా ఉన్నట్టు అనిపించింది. కొన్ని సెంటర్స్‌లో బ్రాడ్ వేస్.. అద్భుతమైన ఇళ్లు.. చక్కటి ల్యాండ్‌స్కేప్స్ ఉన్నాయి. చాలా చోట్ల వీటికి భిన్నమైన పరిస్థితులున్నాయి. ఈవెన్‌దో ఐ గ్రేట్ రెస్పెక్ట్ టువర్డ్స్ హైదరాబాద్ ఫార్మాస్యుటికల్ ఇండస్ట్రీ. అంతేకాదు ఇక్కడి ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ కూడా ప్రపంచంలోని అవకాశాలను వేగంగా అందిపుచ్చుకుంటుంది. సిటీ గ్రోత్ ఈజ్ ఇంప్రెసివ్.