
నెలలో సస్తననుకుంటున్నావ్‌రా?
నన్ను సంపిద్దామని ప్లాన్ చేస్తున్నవ్‌లే
- చచ్చేది నువ్వో, నేనో చూద్దాం
- సీఎం దగ్గరైనా కూర్చో.. నీకు దేవుడే గతి
- వ్యాపారి గంపా నాగేందర్‌కు నయీమ్ బెదిరింపులు
- ఫోన్ సంభాషణలు రికార్డు చేసి పోలీసులకిచ్చిన బాధితుడు
సాక్షి, హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీమ్ నుంచి తీవ్రస్థాయిలో బెదిరింపులు ఎదుర్కొన్న తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, వ్యాపారి గంపా నాగేందర్ ఆ సంభాషణల్ని రికార్డు చేశారు. నయీమ్ ఉదంతంపై ఈ నెల 17న నల్లగొండ జిల్లా భువనగిరి పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. దాంతోపాటు సంభాషణల రికార్డునూ అందించారు. సోమవారం మీడియాకు చేరిన ఆ ఆడియో రికార్డులోని అంశాలు...
నయీమ్: అన్నా నమస్తే అన్నా
నాగేందర్: నమస్తేనే
నయీమ్: ఏమన్నా, అన్ని ఫోన్లూ బంద్ చేసినవ్
నాగేందర్: హాస్పటల్‌లో ఉన్నా. మొత్తం కరువుంది. దాంతో అమౌంట్ అరేంజ్ కాలేదు. ఒక్క నెలలో, మే 31 వరకు చేయిస్తా
నయీమ్: నువ్వు ఇట్ల మాట మార్సుడు మంచిదేనా అన్నా?
నాగేందర్: నేనట్ల చెయ్యనే. మీకు మాటిచ్చినాక ఏ పరిస్థితుల్లోనూ మార. తప్పకుండా చేయిస్తా. 15 రోజుల నుంచి సన్‌స్ట్రోక్‌తో హాస్పటల్‌లో ఉన్నా
నయీమ్: సరే. నువ్విచ్చినా ఇంక తీసుకోను కానీ నేను...
నాగేందర్: అన్నా, నువ్వట్లనకే...
నయీమ్: నీకు రెస్పెక్ట్ ఇచ్చినం. నువ్వు నిలబెట్టుకోలేదన్నా. నువ్వెఎట్లుంటవో మాకు తెల్వదు. రికార్డు చేసుకుంటే చేసుకో. నాకేం భయం కాదు. నా మీద ఓ కేసు అయితాది. అంతకంటే ఎక్కువ ఏం కాదు.
నాగేందర్: నీకు దండం పెడుత. కాల్మొక్కుత. ఒక్క నెల టైమియ్యి
నయీమ్: నీ కొడుకుల్లో ఒకరు దేవుని దగ్గరకు వెళ్తడు
నాగేందర్: మే 31 వరకు 100 శాతం చేయిస్తా. దయచేసి ఈ ఒక్కసారీ నా మాట విను
నయీమ్: నన్ను చంపిద్దామని ఏం ప్లాన్ చేస్తున్నావ్‌లే! నాకన్నీ తెల్సన్నా. నువ్వు చస్తవో, నేను చస్తనో చూద్దాం
నాగేందర్: అన్నా, నేనలాంటి ప్రయత్నాలు చేయట్లేదు. ప్రమాణంగా చెప్తున్నా
నయీమ్: ప్లాన్ వేస్తున్నావ్ కదా. సచ్చేదెవరో ఇప్పుడు చూస్తానింక
నాగేందర్: నీకు దండ పెడతనే. అట్లేంలేదు.
నయీమ్: నువ్వు ప్లాన్ వేస్తే వెయ్. నువ్వెక్కడికి పోతున్నవ్? ఏమేం చేస్తున్నవ్? నా పిల్లల (అనుచరుల) మీద హరాస్‌మెంట్లు చేయిస్తున్నావ్. పీడీ యాక్ట్ పెట్టిస్తున్నావ్. నువ్వేమేం చేసినవో అన్నీ నాకు తెల్సన్నా.
నాగేందర్: అన్నా... అన్నా... అన్నా...
నయీమ్: పో... సీఎం దగ్గరికి పోయి కూర్చో, ఎవరి దగ్గరైనా కూర్చో అన్నా. నీకింక దేవుడే గతి. నీ శక్తి సరిపోతే నువ్వు చేపియ్. నా శక్తి సరిపోతే నేన్ చేపిస్తా
నాగేందర్: నేనట్లా చేసేటోణ్ణి కాదే. నీ మెసేజ్ రాంగానే నీకు ఫోన్ చేసినాను కదే
నయీమ్: మెసేజ్ రాంగానే ఫోన్ చేసినానంటే నీ సద్ది ఇంతేనా అన్నా? తిక్క లెక్క ఉన్నదా నీకు? భయం లేదా నీకు?
నాగేందర్: నన్ను అర్థం చేసుకుని నెల టైమివ్వు (వణుకుతున్న గొంతుతో). అప్పటికీ చెయ్యకపోతే నన్ను అడుగు.
నయీమ్: వన్ మంత్ అని ఈ రోజు చెప్తున్నవ్. మరి ఆ రోజు. ఇక (అమౌంట్) నువ్విచ్చినా నేను తీసుకోను. నీకేమైనా అయితే నాకు తెల్వద్. కేసు పెట్టుకో, ఏమైనా చేసుకో
నాగేందర్: అన్నా, నేను కేసు పెట్టేటోణ్ణి కాదు. పోలీసోళ్ల కాడికి పోయేదుంటే నీకెందుకు ఫోన్ చేస్తనే? అట్లైతే నీ ఫోనే ఎత్త కదే..!
నయీమ్: నువ్వు అక్కడికి పోతే ఏం పీక్తరన్నా.. మాట్లాడితే...
నాగేందర్: నాకన్న పెద్ద పెద్దోళ్లే భయపడ్తరు, దాంట్ల నేనెంతన్నా? వన్ పర్సెంట్ కూడా కాదు
నయీమ్: మరి ఇప్పటివరకు నాకు మాటిచ్చి ఎవరైనా తప్పి ఉంటరా? అంత ధైర్యం చేసి ఉంటరా? నువ్వు చేసినవ్ మరి? నా బాధ్యత ఏందంటే, నీకు ఏం జరుగుతదో ముందో చెప్తున్నా. కాపాడుకోగలిగితే కాపాడుకో ఇంక
నాగేందర్: నీకు దండం పెడ్తనే. కాల్మొక్తనే. వన్‌మంత్ టైమ్ ఇయ్యవే
నయీమ్: ఎట్లా కన్పిస్తున్నా అన్నా నేను? (అమౌంట్) నువ్విచ్చినా నేను తీసుకోను
నాగేందర్: అన్నా, ఈ ఒక్క... ఒక్క...సారికీ (భయపడుతూ) నన్ను కాపాడే
నయీమ్: నువ్వు ఏమనుకుంటన్నవంటే, ‘వన్ మంత్‌లో ఈడు సచ్చిపోతాడు కదా, సచ్చిపోతే పోతాది అనుకుంటున్నావ్ కదా...’ అని. నేను చావన్రా అరేయ్!
నాగేందర్: అన్నా... అన్నా... ప్రమాణంగా ఆ ఆలోచనే లేదన్నా నాకు. నేను భువనగిరికి రాక కూడా తొమ్మిది నెలలయితాందన్నా. నువ్వు చెప్పినావనే వచ్చిన. భువనగిరిల ఉంటలేను
నయీమ్: నువ్వు ఇట్లా చేస్తే నీకు బాగుండదన్నా. నువ్వే పీడీ యాక్ట్, గీడీ యాక్ట్ అన్నీ ప్రెషర్ చేసి చేయించినావని డౌటుంది. కాబట్టి నీకు నెల టైమియ్యలేను. ఈ సాయంత్రం వరకు సగం పేమెంట్ చేసుకో. 15 రోజుల్లో మిగిలింది చేసుకో
నాగేందర్: అన్నా అన్నా అన్నా నీ కాల్మొక్తనే. దండం పెడత. కనీసం వన్‌మంత్ ఇయ్యవే
నయీమ్: ఇయ్యలేనన్నా. ఇయ్యలేను. ఈ రోజు సగం, 15 రోజుల్లో సగం
నాగేందర్: నువ్వు ఇన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదన్నా.. నీతో డెరైక్ట్‌గా మాట్లాడదామంటే నీ నెంబర్ నాకాడ లేక, ఎవరిని కాంటాక్ట్ చెయ్యాలో తెలుస్తలేదన్నా
నయీమ్: ఎవరికియ్యాలేంది? నీకు పాశం అన్న (ఫోన్) చేస్తడని చెప్పినాను కదా. పిల్లలు వస్తరు, ఇయ్యాలని చెప్పినా కదా నీకు
నాగేందర్: అన్నా నెల రోజుల ఆపన్నా. నీ కాల్మొక్తనే. నీకు దండం పెడతనే. ఈ ఒక్కసారీ కాపాడే (వణుకుతున్న గొంతుతో)
నయీమ్: నెల రోజులైతే కాపాడలేనన్నా. నేను చెప్తన్నా చూడన్నా. నీకేమైనా ఇబ్బంది అయితే... ఫోన్ పెట్టేస్త
నాగేందర్: అన్నా, నా జీవితంలో ఎవర్నీ ఇంతల్లా రిక్వెస్ట్ చెయ్యలేదు. వన్‌మంత్ ఆపే. నీ కాల్మొక్కుత. పువ్వుల్ల పెట్టిస్త. నాకు నువ్వు కాంటాక్ట్ అవ్వడమే నా అదృష్టం
నయీమ్: 15 రోజుల టైమ్ తీస్కో. వన్ మంత్ ఇయ్యట్లేదు. నువ్వు ఫోన్ ఎందుకు లేప్తలేవ్ చెప్పు
నాగేందర్: అన్నా, అన్నా. వన్ మంత్
నయీమ్: సరే. ‘పది రూపాయలు’ (అంటే రూ.10 లక్షలు) ఎక్కువియ్యాలె
నాగేందర్: నాకేం పెట్టకే ఇంక. 31 వరకు టైమ్ ఇయ్యవే
నయీమ్: నువ్వు మళ్ళీ 31వ రోజు కూడా కాల్మొక్తవ్
నాగేందర్: అన్నా, ఈసారి తప్పకుండా చేస్తనే. మొక్క ఇక
నయీమ్: చెయ్యకపోతే నేనింక కాల్ చెయ్య మరి
నాగేందర్: చెయ్యకన్నా
నయీమ్: చెయ్యను. తర్వాత ఏం జెయ్యాల్నో జేస్కుంట
నాగేందర్: సరే మంచిదన్నా. 31 లోపట చేయిస్తా. మంచిది.
నయీమ్: 31 లోపట అంటే మన పిల్లలు (అనుచరులు) ఎప్పుడు (కాల్) చెయ్యాలె?
నాగేందర్: కాల్ అవసరం లేదే. మనిషిని పంపియ్ ఇచ్చేస్త
నయీమ్: 31 నాడు మనిషిని పంపియ్యాల్నా?
నాగేందర్: అవ్ అన్నా
నయీమ్: సరే
నాగేందర్: నమస్తే
నయీమ్: సరే అన్నా..31 నాడు ఎక్కడ పంపియ్యాలె మనిషిని?
నాగేందర్: భువనగిరిలో అరేంజ్ చేస్తా
నయీమ్: భువనగిరిల వద్దు. హైదరాబాద్‌ల అరేంజ్ చెయ్
నాగేందర్: సరే. నువ్వు ఎక్కడ చెప్తే అక్కడ చేస్తనే
నయీమ్: ఔనూ, నీకు ఫోన్ ఎప్పుడు చెయ్యాలె?
నాగేందర్: ఫోనెందుకే? 31 నాడు చేపిస్తనే. టైమ్ ఇచ్చినవుగా
నయీమ్: 31 నాడు చెయ్యద్దా ఫోన్ మరి?
నాగేందర్: 31 నాడు చెయ్యవే
నయీమ్: అప్పుడు మళ్ల ఫోన్లు బంద్ పెట్టుకుంటవా?
నాగేందర్: ఇప్పుడు బంద్ ఏమీ పెట్టుకోలేదే నేను
నయీమ్: సరే. ఒక నెలల నేను సచ్చిపోతే పైసలు మిగుల్తాయని అనుకుంటున్నావేమో! నువ్వు, శ్రీధర్‌బాబు ఎవడెవడు కల్సి ఏం చేస్తున్నరో గానీ, నేన్ చెప్తున్నా నువ్వు మంచిగుంటే నేను మంచిగుంటా. నువ్వు చెడ్డగుంటే నేను చేసేది నేను చెయ్యాల్సి వస్తది.
నాగేందర్: అన్నా నీతోటి కల్సిన తర్వాత నేను ఎవర్నీ, శ్రీధర్‌బాబు అన్నను కూడా కల్వలేదు. నేతి విద్యాసాగర్‌ని కూడా నువ్వు కల్వద్దు అన్నాక నేను కల్వలేదు
నయీమ్: సరే. నేను 31 తారీఖు ఫోన్ చేస్తా. నేను లేదా పాశం అన్న చేస్తడు. ఫోన్ ఆన్ పెట్టుకో
(ఈ సందర్భంలో వాహనాల హారన్ శబ్దాలు వినిపించాయి. దీన్ని బట్టి ఆ సమయంలో నయీమ్ ఏదైనా హైవేపై ఉండి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు)
నాగేందర్: మంచిదన్నా. ఉంటనే