నీట్ విధానం వల్ల నష్టంలేదు | NEAT system does not damage: Dr Venugopal rao | Sakshi
Sakshi News home page

నీట్ విధానం వల్ల నష్టంలేదు

Published Thu, Apr 28 2016 6:23 PM | Last Updated on Tue, Oct 9 2018 7:05 PM

NEAT system does not damage: Dr Venugopal rao

-మనవాళ్లు అత్యున్నత కళాశాలల్లో సీట్లు పొందే అవకాశం
-యాజమాన్య సీట్ల భర్తీ కూడా మెరిట్ ఆధారంగానే
-సాక్షి’తో వైద్యవిద్యా సంచాలకులు డా.వేణుగోపాలరావు


దేశవ్యాప్తంగా ఓకే ప్రవేశ పరీక్ష నీట్’ విధానం వలన రాష్ట్ర విద్యార్థులకు ఎలాంటి నష్టమూ ఉండదని, పైగా దీనివల్ల లాభమే జరుగుతుందని వైద్యవిద్యా సంచాలకులు డా.టి.వేణుగోపాల్‌రావు స్పష్టం చేశారు. ఈ విధానం వలన మన విద్యార్థులు జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు సాధించే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఆయన సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. గతంలో తాను ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ రిజిస్ట్రార్‌గా ఉన్నప్పుడు నీట్’పై పలువురు నిపుణులతో రాష్ట్రప్రభుత్వం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి అభిప్రాయాలు సేకరించిందన్నారు. అప్పట్లో 90 శాతం మంది నిపుణులు నీట్’ విధానమే మంచిదని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారన్నారు.



 అయితే అప్పట్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా నీట్’ అమల్లోకి రాలేదని, ఆ తర్వాత రాష్ట్రం విడిపోవడం వంటి పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ ప్రవేశ పరీక్ష కారణంగా మన ర్యాంకులకు ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం వాటిల్లదని అన్నారు. పైగా దీనివల్ల భవిష్యత్‌లో ప్రైవేటు కళాశాలల్లో ఉన్న యాజమాన్య కోటా సీట్లు కూడా ప్రతిభ ఆధారంగా భర్తీ అయ్యే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

 

అప్పుడు ప్రైవేటు కళాశాలలు ర్యాంకుల ఆధారంగా నిర్ణయించిన ఫీజులు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందని, కోట్లకు కోట్లు వసూలు చేసే అవకాశం ఉండదని అన్నారు. ఇక ప్రవాస భారతీయ కోటా సీట్లు 15 శాతం మాత్రమే యాజమాన్యాల చేతుల్లో ఉంటాయని అవి కూడా కోర్టు తీర్పుననుసరించి భర్తీ చేయాల్సి ఉంటుందన్నారు. నీట్ వలన దేశవ్యాప్తంగా అత్యున్నత కళాశాలల్లో సీట్లు లభించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది పీజీ సీట్ల పెంపు 2017-18 ఏడాదికి రాష్ట్రంలో వందకుపైగా పీజీ వైద్య సీట్ల పెంపునకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.



ఇప్పటికీ భారతీయ వైద్యమండలికి ప్రతిపాదనలు వెళ్లాయని అన్నారు. సీట్లు రావడానికి కావాల్సిన మౌలిక వసతుల కల్పన జరుగుతోందన్నారు. త్వరలోనే అసోసియేట్ ప్రొఫెసర్లకు పదోన్నతులు కల్పించి, అసిస్టెంట్ ప్రొఫెసర్లను భర్తీ చేస్తామని అన్నారు. గత ఏడాది ఆరు కళాశాలలకు వచ్చిన 300 అదనపు ఎంబీబీఎస్ సీట్లకు ఎలాంటి సమస్య ఉండదని డా.వేణుగోపాల్ రావు స్పష్టం చేశారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement