ఈ ఏడాది ‘నీట్’ లేదు | neat Exception for this year andhra and telangana | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది ‘నీట్’ లేదు

Published Sat, May 21 2016 3:36 AM | Last Updated on Wed, Sep 26 2018 3:23 PM

ఈ ఏడాది ‘నీట్’ లేదు - Sakshi

ఈ ఏడాది ‘నీట్’ లేదు

- పలు రాష్ట్రాలను మినహాయిస్తూ ఆర్డినెన్స్ జారీకి కేంద్రం నిర్ణయం
- ప్రభుత్వ వైద్య కళాశాలలకు మినహాయింపు ఇచ్చేందుకు ఓకే
- ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్, నాన్‌లోకల్ సీట్లకూ నీట్ వర్తించదు
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు మినహాయింపు
- మినహాయింపు ఈ ఏడాదికే.. వచ్చే ఏడాది నుంచి నీట్ తప్పదు
- కేంద్ర కేబినెట్ భేటీలో నిర్ణయం.. రాష్ట్రపతిని కలవనున్న నడ్డా
- ఆ ఆర్డినెన్స్ జారీ చేస్తే సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాం: సంకల్ప్
- ప్రైవేటు కాలేజీల లాబీ ప్రయోజనం కోసమే ఆర్డినెన్స్: కాంగ్రెస్

 

న్యూఢిల్లీ: వైద్య విద్యలోని ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ‘నీట్’ పరీక్ష నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ఈ ఏడాది మినహాయింపు లభించనుంది. రాష్ట్రాల నుంచి వ్యక్తమైన ఆందోళనలు, ఒత్తిడి మేరకు.. నీట్ నుంచి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ఏడాది మినహాయింపు ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అందుకోసం ఒక ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించింది. అన్ని రాష్ట్రాలు, మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు నీట్ మాత్రమే ఏకైక ప్రవేశ పరీక్షగా ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను పాక్షికంగా సవరిస్తూ ఈ ఆర్డినెన్స్‌ను తీసుకురానుంది.

శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ భేటీలో నీట్ వివాదం, ఆర్డినెన్స్ జారీ అంశంపై చర్చించి ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్డినెన్స్ జారీ కోసం ఆరోగ్య మంత్రి జె.పి.నడ్డా త్వరలో రాష్ట్రపతిని కలవనున్నారు. ఆర్డినెన్స్ జారీ అయితే ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల విద్యార్థులు ఈ ఏడాది తప్పనిసరిగా నీట్ రాయాల్సిన అవసరం ఉండదు. అయితే.. వారు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఎంసెట్ వంటి రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అలాగే.. ప్రైవేటు కాలేజీలు, డీమ్డ్ వర్సిటీల్లో ప్రభుత్వ కోటా మినహా మిగతా సీట్లన్నిటికీ(మేనేజ్‌మెంట్ కోటాకు) నీట్ వర్తిస్తుంది. అంటే.. విద్యార్థులు ప్రభుత్వ కాలేజీలు, ప్రైవేటు కాలేజీల్లోని ప్రభుత్వ(కన్వీనర్) కోటా సీట్లలో ప్రవేశాలకు రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్ష రాయాలి. ప్రైవేటు కాలేజీలు, డీమ్డ్ వర్సిటీల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో ప్రవేశానికి ‘నీట్’ రాయాల్సి ఉంటుంది.

 దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి ఒకే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)ను ఈ ఏడాది నుంచే తప్పనిసరిగా అమలు చేయాలంటూ ఇటీవల సుప్రీం ఇచ్చిన ఆదేశాలపై పలు రాష్ట్రాల ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సుప్రీం ఆదేశాల మేరకు మే 1న ‘నీట్’ తొలి విడత పరీక్ష నిర్వహించిన కేంద్రం.. ఆ పరీక్ష రాయని వారికి అవకాశం కల్పిస్తూ జూలై 24న ‘నీట్’ రెండో విడత పరీక్షను నిర్వహించనుంది. అయితే.. సీబీఎస్‌ఈ ‘నీట్’ సిలబస్‌కు - రాష్ట్ర కోర్సుల్లోని సిలబస్‌కు మధ్య ఉన్న తేడాలు, ప్రాంతీయ భాషల వారికి అన్యాయం జరుగుతుం దన్న ఆందోళనలు, నీట్‌కు సిద్ధమవటానికి విద్యార్థులకు అవసరమైనంత సమయం లేకపోవటం వంటి అంశాలను పలు రాష్ట్రాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లటం.. నీట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరటం విదితమే.

నీట్ తప్పనిసరి చేయటాన్ని దాదాపు 15 రాష్ట్రాలు వ్యతిరేకించాయని కేంద్ర వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై రాష్ట్రాల వైద్యమంత్రులతో సమావేశమైన జె.పి.నడ్డా.. సామరస్య పూర్వక పరిష్కారంపై చర్చించారు. ప్రభుత్వ కాలేజీలకు ఏడాదిపాటు ప్రభుత్వ కాలేజీలకు మినహాయింపు ఇవ్వటం, వచ్చే ఏడాదినుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ.. అందరికీ సంయుక్తంగా ఒకే పరీక్షను నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ మేరకు ఈ ఏడాది రాష్ట్రాలకు నీట్ నుంచి మినహాయింపునిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలతోపాటు డీమ్డ్ వర్సిటీలన్నీ ఈ ఏడాది నుంచే నీట్ పరిధిలోకి వస్తాయన్న సుప్రీం తీర్పులో కొన్ని మార్పులు చేస్తూ ఈ ఆర్డినెన్స్ తీసుకురానుంది. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని కాలేజీలతో పాటు.. ప్రైవేటు కాలేజీల్లోని కన్వీనర్ కోటా, నాన్‌లోకల్(పక్క రాష్ట్రాల విద్యార్థులు) కోటాకు ఈ ఏడాది ‘నీట్’ నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. ఇవి పోగా ప్రైవేటు కాలేజీలు, డీమ్డ్ వర్సిటీల్లోని స్థానికుల కోసం కేటాయించే మిగతా సీట్లకు ఈ ఏడాదే ‘నీట్’ వర్తిస్తుందని కేంద్ర వర్గాలు చెప్తున్నాయి.

 ఆర్డినెన్స్ తెస్తే సవాల్ చేస్తాం: సంకల్ప్
రాష్ట్ర ప్రభుత్వాల వైద్య కళాశాలలను ఈ ఏడాది ‘నీట్’ పరిధి నుంచి మినహాయించేందుకు కేంద్రం తీసుకురానున్న ఆర్డినెన్స్‌ను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని సంకల్ప్ చారిటబుల్ ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఒకే వైద్య ప్రవేశ పరీక్ష నిర్వహించాలనే డిమాండ్‌తో సుప్రీంకోర్టు తలుపులు తట్టింది కూడా ఈ సంస్థే. ఈ సంస్థ తరఫు న్యాయవాది అమిత్‌కుమార్ శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు భంగం కలిగిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురాజాలదు. ఈ కేసు విచారణ సందర్భంగా నీట్ నిర్వహించటంలో తమకు ఎటువంటి ఇబ్బందీ లేదని కేంద్రం ఒక వైఖరి తీసుకుంది. కానీ ఇప్పుడు ఇలా మాట మార్చేసి రాష్ట్రాలకు నీట్ నుంచి మినహాయింపు ఇవ్వజాలదు. ఆ ఆర్డినెన్స్ జారీ చేస్తే దానిని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాం’’ అని పేర్కొన్నారు.

 ప్రైవేటు లాబీకే ప్రయోజనం: కాంగ్రెస్
ప్రైవేటు మెడికల్ కాలేజీల లాబీకి ప్రయోజనం చేకూర్చటానికే విద్యార్థులను పణంగా పెడుతూ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొస్తోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పి.సి.చక్కో విమర్శించారు. నీట్ నుంచి మినహాయింపు కల్పిస్తూ ఆర్డినెన్స్ తేవాలన్న కేంద్ర కేబినెట్ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని తప్పుపట్టారు. అంతకుముందు.. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాస్తూ.. నీట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్న ఒత్తిడికి తలొగ్గవొద్దని కోరారు. చాలా మంది రాజకీయ నాయకులు వైద్య కళాశాలలను నడుపుతున్నందునే ఈ మినహాయింపు కోసం ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.

 సీట్ల కేటాయింపుపై సమీక్షించండి: సీఐసీ
దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో సీట్ల కేటాయింపుపై కేంద్రం (ఎంసీఐ) విమర్శనాత్మక సమీక్ష నిర్వహించాలని కేంద్ర సమాచర కమిషన్(సీఐసీ) నిర్దేశించింది.  కేటాయించిన సీట్ల కన్నా ఎక్కువ మందిని చేర్చుకుంటున్నారని తమ దృష్టికి వచ్చిందని.. దీనిపై విచారణ జరిపి దోషులుగా తేలిన కాలేజీలపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

రెండు రోజుల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు : నీట్‌పై కేంద్ర మంత్రి నడ్డా
న్యూఢిల్లీ: నీట్ విషయంలో అందరి ఆందోళనలనూ పరిష్కరించటానికి రెండు రోజుల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లను ఖరారు చేస్తామని కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి జె.పి.నడ్డా పేర్కొన్నారు. నీట్‌ను మొత్తానికి రద్దు చేస్తున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలు నిరాధారమని కేంద్ర కొట్టివేశారు. ఆయన శుక్రవారం రాత్రి పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడారు. ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్రాలకు మినహాయింపు ఇస్తున్నారా అన్న ప్రశ్నకు.. ఆ అంశాలపైనే తాము కృషి చేస్తున్నామని బదులిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు లేవనెత్తిన మూడు సమస్యలు - కొనసాగుతున్న పరీక్షలు, సిలబస్, ప్రాంతీయ భాషలు - వీటిని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

‘‘ఈ రోజు కేబినెట్ సమావేశమైంది. చాలా అంశాలపై చర్చించటం జరిగింది. మేం సంప్రదింపులు జరుపుతున్నాం. ఒక కట్టుదిట్టమైన ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. రేపటికి లేదా ఎల్లుండి (శనివారం లేదా ఆదివారం) కల్లా మేం ఒక నిర్ణయానికి వస్తాం. కేబినెట్ తన అభిప్రాయం చెప్పింది. దానిపై మేం కృషి చేస్తున్నాం’’ అని వివరించారు. నీట్‌ను రద్దు చేస్తున్నట్లు వచ్చిన వార్తలు నిరాధారమని కొట్టివేశారు. నీట్ అమలులో ఉందని, తొలి విడత నీట్ పూర్తయిందని, రెండో విడత జూలై 24న జరుగుతుందని స్పష్టంచేశారు.

ఆ తర్వాత సామాజిక వెబ్‌సైట్ ట్విటర్‌లోనూ ఈ అంశంపై ట్వీట్లు చేశారు. ‘నీట్‌కు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. అఖిలపక్ష సమావేశం, ఆరోగ్యశాఖా మంత్రుల సమావేశంలో వ్యక్తమైన ఉమ్మడి అభిప్రాయం స్ఫూర్తితో కేంద్రం నిర్ణయం తీసుకునే ప్రక్రియలో ఉంది. నీట్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు, లక్షలాది మంది విద్యార్థుల ఆందోళనలను పరిష్కరిస్తున్నాం’ అని ఆ ట్వీట్లలో పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement