నగర వాసుల్లో అనవసర భయాలు
పదేపదే ఒకే పని...
డాక్టర్ల చుట్టూ ప్రదక్షిణలు
మోహన్‌కు ఎవరైనా షేక్‌హ్యాండ్ ఇస్తే రోజంతా అదే పనిగా చేతులు కడుగుతూనే ఉంటాడు. కళ్యాణి ఇంటిలో ఎవరైనా అడుగు పెడితే పదే పదే ఇల్లంతా నీళ్లు చల్లి శుభ్రం చేస్తూనే ఉంటుంది. ఇదే విషయమ్మీద భార్యాభర్తల మధ్య అనేకసార్లు గొడవలు చోటుచేసుకున్నాయి. అయినా ఆమెలో మార్పు లేదు. పైగా సాధారణ దగ్గు వచ్చినా తనకు క్యాన్సర్ వచ్చిందేమోననే భయంతో విలవిల్లాడిపోతుంది. అదేమని అడిగితే...ఫలానా సినిమాలో హీరోయిన్ ఇలాగే చనిపోయిందంటూ ఆ పాత్రను తనకు అన్వయించుకుంటుంది... ఇలాంటి మోహన్‌లు, కళ్యాణిలు మన మధ్య చాలా మంది ఉంటున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా ‘చాదస్తుల’ సంఖ్య పెరుగుతుండడం విస్తుగొల్పుతోంది.
బంజారాహిల్స్: ఒకే పని రోజంతా చేస్తుండడం... ఒకేమాట పదే పదే చెప్పడం.. ముట్టుకుంటారనే భయం.. పట్టుకుంటారని బెంగ.. తనపై ఏదో పడుతుందని ఆందోళన.... అన్ని సమస్యలూ తన పైనే వేసుకుని... అన్నింటినీ తానే భరిస్తున్నట్లు భావించడం.. ఇలాంటి చేష్టలు ఇటీవల నగర వాసుల్లో పెరిగిపోయాయి.. చొక్కాను పట్టుకొని అదే పనిగా లాగుతుండటం.. సబ్బుతో పదే పదే ముఖం కడగడం వంటి చాదస్తాలను పాటించే వారు పెరుగుతున్నారు. ఇవే కాదు.. ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు నగర వాసుల్లో అనుమానాలను పెంచడమే కాకుండా వారిని మరింత చాదస్తులుగా మారుస్తున్నాయి.. ఈ సమస్య చిన్నారులు మొదలుకొని అన్ని వయస్సుల వారిలోనూ కనిపిస్తోంది.
ప్రముఖులకూ తప్పని భయాలు
{పిన్సెస్ డయానా.. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఈ అందాల రాశి కూడా ఒక రకమైన చాదస్తంతో బాధపడేది. ‘ఈటింగ్ డిజార్డర్’తో బాధ పడే ఆమె తాను చాలా ఫిట్‌గా ఉన్నాననే కారణంగా ఆహారం ఎక్కువ తీసుకుని వాంతులు చేసుకునేది.రోగులకు ఎంతో విశిష్ట సేవలందించిన ఫ్లోరెన్స్ నైటింగేల్ సైతం ఒక రకమైన చాదస్తంతో ఉండేది. ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (సీఓడీ) కారణంగా ఆమె చివరి దశలో మంచం మీదనే ఎక్కువ కాలం గడపాల్సి వచ్చింది.
వీరే కాదు.. ప్రస్తుత సమాజంలో చాలా మంది ఇలాంటి చాదస్తాలతో సతమతమవుతున్నారు. జీవన శైలిలోని విపరీత పరిణామాలకు తోడు.. పని విధానంలోని అసాధారణమైన మార్పులు... ఒత్తిడి ఇలాంటి చాదస్తాలు... అనుమానాలకు తావిస్తోంది.
అతి..అనర్థం
నగరానికి చెందిన ఓ వ్యక్తి బంజారాహిల్స్‌లో నడిచి వెళుతూ ఒక భవన నిర్మాణం వద్ద తల పెకైత్తి చూశాడు. అదే సమయంలో అతని కంట్లో సిమెంటు నీటి చుక్క పడింది. దీంతో అతను తన కంట్లో ఎవరో ఎయిడ్స్ ఉన్న వ్యక్తి ఉమ్మి వేశాడంటూ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ఆస్పత్రులకు వెళ్లి ఎయిడ్స్ పరీక్షలు చేయించుకున్నాడు. ఎలాంటి సమస్య లేదని ఎంతమంది వైద్యులు చెప్పినా నమ్మకుండా ఇప్పటికీ అలాగే ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాడు. ఎంటెక్ చదివిన మరో యువకుడు తనకు ఎలర్జీ ఉందనే అభిప్రాయంతో తన చేతులను సబ్బుతో నిరంతరం అదే పనిగా కడుగుతుండేవాడు. దీంతో అధిక రాపిడికి గురైన అతని చేతులు రంగు మారిపోయాయి.
మచ్చుకు కొన్ని...
మహిళల్లో చాలా మంది ఇంటిని పదే పదే ఊడ్చటం, తుడవడం.. ఎవరైనా ఇంటికి వచ్చి వెళ్తే మళ్లీ శుభ్రం చేయడం లాంటి సంఘటనలు కోకొల్లలు. మరికొందరు గ్యాస్ స్టౌను ఆపేశామా? లేదా 20 నుంచి 30 సార్లు తనిఖీ చేసుకోవడం చాదస్తాల్లో భాగమే. మరికొందరు రుచి చూసే పేరుతో పొయ్యి మీది వంటకాన్ని సగం ఖాళీ చేస్తుంటారు. ఇలాంటి కేసులు అనేకం తన వద్దకు కూడా వస్తున్నాయని చెబుతున్నారు నగరానికి చెందిన మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ పూర్ణిమా నాగరాజు.
‘ఫర్‌ఫెక్ట్’ కావాలనుకొని...
చాలామంది ఉద్యోగులు తమకు తాము పర్‌ఫెక్ట్‌గా ఉన్నామనే భావనలో ఉంటారు. మరికొందరు ఉద్యోగులు కార్యాలయాల్లో అన్ని పనులు తామే చేస్తుండటం... జట్టులో ఉన్న ఇతర సభ్యుల బాధ్యతల్లోకి తొంగిచూడటం.. పనంతా తానే చేస్తున్నట్లుగా భావించడం చేస్తుంటారు. దీనికి తోడు తమ ఉద్యోగంపై భయం. పక్కవారు చూస్తున్నారేమోననే ఆందోళన. ఇలాంటివన్నీ చాదస్తులుగా మారుస్తున్నాయి. కొందరు యువకులు విపరీత స్థాయిలో ప్రేమను ప్రదర్శిస్తుంటారు. తాను ప్రేమించిన అమ్మాయి మీద సర్వ హక్కులు తనవేనని అతిగా పెత్తనాన్ని చెలాయిస్తుంటారు...ఇదీ చాదస్తంలో భాగమే. కొంతమంది సన్నగా, అస్థిపంజరంలా ఉన్నప్పటికీ తాము చాలా లావుగా ఉన్నామన్న భావనతో ఇంకా డైటింగ్ చేస్తుంటారు. ఈటింగ్ డిజార్డర్‌లో భాగమైన ‘బులీమియా’ అనే చాదస్తంతో వీరు బాధ పడుతున్నట్టు లెక్క. మరికొందరు తాము ఫిట్‌గా ఉన్నామనే భావనతో ఏది తిన్నా ఏం కాదని అతిగా తిని వాంతులు చేసుకుంటారు.. ఇలాంటి వారిని సాధారణంగా ‘అనోరెక్సియా’ బాధితులుగా పరిగణిస్తారని డాక్టర్ పూర్ణిమ పేర్కొన్నారు.
ఇదేం ‘చాదస్తం’
Published Sat, Feb 28 2015 11:49 PM | Last Updated on Sat, Sep 2 2017 10:05 PM
Advertisement
Advertisement