హైదరాబాద్లో పేలుళ్లకు ఐఎస్ఐఎస్ కుట్ర
ఒకవైపు టర్కీలోని ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ఉగ్రవాద దాడి కలకలం రేపితే.. మరోవైపు హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో ఐఎస్ఐఎస్ సానుభూతిపరులుగా అనుమానిస్తున్న 13 మందిని ఎన్ఐఏ వర్గాలు అదుపులోకి తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్లో పేలుళ్లకు ఐఎస్ఐఎస్ పన్నిన కుట్రను ఎన్ఐఏ భగ్నం చేసినట్లయింది. బుధవారం తెల్లవారుజామున ఏక కాలంలో పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేసి, ఈ 13 మందిని తమ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు, విదేశీ కరెన్సీలను స్వాధీనం చేసుకున్నారు.
ఇంతకుముందు నిక్కీ జోసెఫ్ తో పాటు మరో యువకుడిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వాళ్ల విచారణ సమయంలో బయటపడిన వివరాల ఆధారంగానే తాజాగా 13 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కొంతమంది ఐఎస్ఐఎస్ సానుభూతిపరులు అరెస్టయిన ప్రాంతాల్లోనే వీళ్లు కూడా దొరికారని అంటున్నారు. దీంతో హైదరాబాద్లో కూడా ఐఎస్ఐఎస్ నెట్వర్క్ పనిచేయడం మొదలుపెట్టినట్లు తెలిసింది. తెలంగాణకు చెందిన ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి కూడా ఈ అరెస్టులను నిర్ధారించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని, భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, విదేశీ కరెన్సీలను స్వాధీనం చేసుకున్నామని ఎన్ఐఏ అధికారులు కూడా తెలిపారు. ఈ ప్రాతంలో మరింతమంది ఐఎస్ఐఎస్ సానుభూతి పరులు ఉండే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.