సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో సంచలనం సృష్టించిన అల్లర్ల కేసులో సయ్యద్ సాదిక్ అలీ అనే వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. బెంగళూరులో తీవ్ర హింసకు దారి తీసిన దాడికి కుట్ర పన్నినట్లుగా భావిస్తున్న అతడిని అదుపులోకి తీసుకుంది. కాగా సోషల్ మీడియాలో ఓ కమ్యూనల్ పోస్టు కలకలం రేపిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటిపై ఆగష్టు 11న అల్లరి మూకలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే నివాసం ఎదుట ఉన్న వాహనాలకు నిప్పు పెట్టడంతో పాటుగా, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో డీజే హళ్లి, కేజీ హళ్లి పోలీస్ స్టేషన్లపై దాడి చేసి విధ్వంసం సృష్టించాయి. ఈ క్రమంలో బెంగళూరులో 144 సెక్షన్ అమలు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.(చదవండి: ఎమ్మెల్యే ఇంటిపై దాడి.. చెలరేగిన హింస)
ఈ ఘటన జాతీయస్థాయిలో ప్రకంపనలు రేపడంతో కేంద్ర హోంశాఖ ఆదేశాలతో సెప్టెంబరు 21న బెంగళూరు అల్లర్లపై ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో గురువారం 30 చోట్ల సోదాలు నిర్వహించింది. ఇందులో భాగంగా ఎయిర్‌గన్, పదునైన ఆయుధాలతో పాటు, ఐరన్ రాడ్డులతో పాటు పలు ఎలక్ట్రానిక్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో బెంగళూరులోని ఓ బ్యాంకులో రికవరీ ఏజెంటుగా పనిచేస్తున్న సయ్యద్ సాదిక్ ఆగష్టు 11 ఘటన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లాడని, నేడు అతడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment