వంటగ్యాస్‌కు ఆధార్ కట్!
వారం తర్వాత అమల్లోకి వచ్చే అవకాశం!
సాక్షి, హైదరాబాద్: వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆధార్ రహిత సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ల జారీకి ఎట్టకేలకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ)ని తాత్కాలికంగా నిలిపివేసిన ప్రభుత్వం ఆధార్‌తో నిమిత్తం లేకుండా పాత విధానంలోనే వినియోగదారులకు సబ్సిడీ సిలిండర్లు అందించాలంటూ తాజాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు, డీలర్లకు లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేసింది. అయితే వినియోగదారులకు పాత విధానం అమల్లోకి రావడానికి మరో వారం రోజులు పట్టే అవకాశం ఉంది. డీబీటీ తర్వాత డీలర్లంతా కొత్త సాఫ్ట్‌వేర్ ఏర్పాటు చేసుకున్నారు.
తాజాగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో మళ్లీ పాత పద్ధతిలో సాఫ్ట్‌వేర్ రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఇందుకు కనీసం వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని, ఇదే విషయాన్ని పెట్రోలియం మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. పాత విధానం అమల్లోకి వస్తే వినియోగదారులు కేవలం సబ్సిడీ ధర (సుమారు రూ.440) మాత్రమే చెల్లించి సిలిండర్ తీసుకోవచ్చు. ఆధార్ నమోదు, బ్యాంకు ఖాతాతో ఆధార్ అనుసంధానం, సబ్సిడీ మొత్తం బ్యాంకులో జమ కాకపోవడం లాంటి తలనొప్పులు ఇక ఉండవు. ప్రతి వినియోగదారుడు ఏడాదికి 12 సిలిండర్లు ఇలా సబ్సిడీ మొత్తాన్ని చెల్లించి తీసుకోవచ్చు.