స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు
హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై అవిశ్వాస తీర్మానానికి వైఎస్ఆర్‌సీపీ నోటీసు ఇచ్చింది. అసెంబ్లీ కార్యదర్శికి ఈ మేరకు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు మంగళవారం ఉదయం నోటీసు అందించారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెడతామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారమే ప్రకటించారు. సోమవారం అసెంబ్లీ వాయిదా పడిన తరువాత బయటకు వెళుతుండగా లాబీల్లో విలేకరులడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఈ విషయం తెలిపారు. సభ జరిగిన తీరుపై వ్యాఖ్యానించమని కోరగా.. ‘చూశారుగా... ఇది కౌరవ సభలాగా సాగింది...’ అన్నారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడారు. స్పీకర్ సోమవారం సభలో వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. స్పీకర్ తీరులో మార్పు వస్తుందని తాము చాలాకాలంగా ఎదురుచూశామని, అయితే ఆయన మరింత ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉండటం తమకు బాధ కలిగిస్తోందని చెప్పారు.
అవిశ్వాస తీర్మానంపై తాము డివిజన్ కోరినా స్పీకర్ తిరస్కరించారని, మూజువాణీ ఓటుతో వీగిపోయినట్లు ప్రకటించారని విమర్శించారు. సోమవారం సభ సాగిన తీరుపై మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలను రక్షించుకోవడానికే అలా చేశారన్నారు. ఒక్క నిమిషం జగన్ మాట్లాడితే చాలు వెంటనే ఐదారుమంది అధికారపక్షం వారికి అవకాశం ఇచ్చి 20 నుంచి 30 నిమిషాల వరకు మాట్లాడిస్తున్నారని చెప్పారు. అధికారపక్షం వారు చెయ్యెత్తకున్నా లేపి మాట్లాడిస్తున్నారని విమర్శించారు. స్పీకర్ వైఖరిని చూశాక అవిశ్వాస తీర్మానం పెట్టక తప్పడం లేదని శ్రీకాంత్‌రెడ్డి వివరించారు.
బాబుకు ధైర్యముంటే విచారణకు సిద్ధపడాలి
అన్నా హజారేకు సోదరుడినన్నట్టుగా డబ్బా కొట్టుకుంటున్న చంద్రబాబు.. తనపై వస్తున్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు ఎందుకు అంగీకరించడం లేదని గడికోట సూటిగా ప్రశ్నించారు. విచారణలకు ఆదేశిస్తే అభివృద్ధి ఆగిపోతుందని చెప్పి తప్పించుకుంటున్నారని చెప్పారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఔటర్ రింగురోడ్డుపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణకు ఆదేశించారని, అంతమాత్రాన అభివృద్ధి ఆగిపోయిందా? అని ఆయన ప్రశ్నించారు. ధైర్యం ఉంటే చంద్రబాబు విచారణకు సిద్ధపడాలని డిమాండ్ చేశారు. స్పీకర్ స్థానంపై తమకు గౌరవం ఉన్నా అవిశ్వాస తీర్మానం పెట్టక తప్పడం లేదని చెప్పారు.