4న ‘స్పీకర్‌పై అవిశ్వాసం’ చర్చ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు మీద వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చకోసం ఏప్రిల్ 4వ తేదీన శాసనసభ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఆరోజు ఉదయం ఎనిమిదిన్నర లేదా తొమ్మిది గంటలకు సభ సమావేశమై రెండు గంటలపాటు ఈ అంశంపై చర్చించనుంది. గురువారం జరిగిన శాసనసభా వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ కోడెల అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, శాసనసభ వ్యవహారాలమంత్రి యనమల రామకృష్ణుడు, కార్మిక మంత్రి కె.అచ్చెన్నాయుడు, చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు, వైఎస్సార్‌సీఎల్పీ ఉప నేత జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, బీజేఎల్పీ నేత విష్ణుకుమార్‌రాజు పాల్గొన్నారు. సమావేశంలో ప్రభుత్వం.. ముందుగా నిర్ణయించి నట్లే నాలుగో తేదీన అవి శ్వాస తీర్మానంపై చర్చ చేపడతామని తెలిపింది. అందుకు ప్రతిపక్షం కూడా అంగీకరించింది. స్పీకర్‌పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం మీద రెండుగంటల పాటు చర్చించాలని నిర్ణయించారు. అయితే రెండుగంటలకు మించి చర్చ జరిగే అవకాశముంది. ఈ అంశంపై రెండురోజులపాటు చర్చిం చాలని వైఎస్సార్‌సీపీ సభ్యులు కోరినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఒకరోజు చర్చకు మాత్రమే అంగీకరించింది.
అది కూడా సభలో పార్టీల బలాబలాలకు అనుగుణంగా అవిశ్వాసంపై మాట్లాడేందుకు సమయమివ్వాలని నిర్ణయించింది. వైఎస్సార్‌సీపీ సభ్యులపై టీడీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన హక్కుల ఉల్లంఘన తీర్మానం మీద కూడా బీఏసీ సమావేశంలో చ ర్చ జరిగింది. అంతకుముందు ఇదే అంశంపై ప్రభుత్వంతోపాటు ప్రతిపక్షంతో చర్చలు జరిపిన విష్ణుకుమార్‌రాజు స్పీకర్ మీద ప్రతిపక్ష సభ్యులు చేసిన వ్యాఖ్యలపై వారు విచారం వ్యక్తం చేసే అంశాన్ని తాను సభలో చదివి వినిపిస్తానని అన్నారు.