అంతా తూచ్‌! | No dealings to police and politicians in nayeem case t- govt disclosure to HC | Sakshi
Sakshi News home page

అంతా తూచ్‌!

Published Fri, Dec 30 2016 1:57 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM

అంతా తూచ్‌! - Sakshi

అంతా తూచ్‌!

నయీమ్‌తో రాజకీయ నాయకులు, పోలీసులెవరికీ సంబంధాల్లేవ్‌..
హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి
నయీమ్‌ ద్వారా వారు ఎటువంటి లబ్ధీ పొందలేదు
మావోయిస్టులు, దావూద్‌తో సంబంధాలున్నట్లూ ఆధారాల్లేవ్‌
మాజీ డీజీపీ, మాజీ మంత్రిపై ఆరోపణలూ అవాస్తవం
ఈ కేసు దర్యాప్తు సంతృప్తికరంగా సాగుతోంది
167 కేసులు పెట్టి.. 116 మందిని అరెస్టు చేశాం
848 మంది సాక్ష్యాలు నమోదు చేశాం
రాజకీయ ప్రయోజనాలు, ప్రచారం కోసమే పిల్‌
భారీ జరిమానాతో దీనిని కొట్టివేయండి
హైకోర్టులో హోంశాఖ ముఖ్య కార్యదర్శి కౌంటర్‌
ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదని నివేదన  


సాక్షి, హైదరాబాద్‌ : గ్యాంగ్‌స్టర్‌ నయీముద్దీన్‌ అలియాస్‌ నయీమ్‌ కేసు తేలిపోయింది. అతనితో రాజకీయ నాయకులకు గానీ, పోలీసులకు గానీ ఎటువంటి సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చేసింది. నయీమ్‌ ద్వారా నేతలు, పోలీసులు లబ్ధి పొందారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని, అందుకు ఎటువంటి ఆధారాలూ లేవని... ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిన అవసరమూ లేదని హైకోర్టుకు వివరించింది. మావోయిస్టుల కదలికలను తెలుసుకునేందుకు పోలీసులు నయీమ్‌ను వాడుకున్నారన్న దాంట్లోనూ వాస్తవం లేదంది. నయీమ్‌కు మావోలతో గానీ, దావూద్‌ ఇబ్రహీంతో గానీ సంబంధాలు ఉన్నాయనేందుకూ ఆధారాలు లభించలేదని తెలిపింది. నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో హైకోర్టులో పిల్‌ వేసిన సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు నారాయణ తెలంగాణలో అధికార పార్టీకి రాజకీయ ప్రత్యర్థి అని... రాజకీయ ప్రయోజనాలు ఆశించి, ప్రచారం కోసమే ఈ పిల్‌ దాఖలు చేశారని నివేదించింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని వ్యాజ్యాన్ని భారీ జరిమానాతో కొట్టివేయాలని కోరింది.

పిల్‌ వేసిన నారాయణ
నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ తరువాత అతని దురాగతాలు వెల్లడైన నేపథ్యంలో కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే. దానిపై విచారణ చేపట్టిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాల మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌ త్రివేదీ గురువారం కౌంటర్‌ దాఖలు చేశారు. కౌంటర్‌లో త్రివేది పేర్కొన్న ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి..

లొంగిపొమ్మని చెప్పినా వినలేదు
నయీమ్‌ డబ్బు కోసం తనను బెదిరిస్తున్నారంటూ నిజామాబాద్‌ జిల్లా దాచేపల్లి మండలం అమృతపూర్‌కు చెందిన కురపాటి గంగాధర్‌ అనే వ్యక్తి దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దానిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో నయీమ్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లోని మిలీనియం కాలనీలో నివసిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో 8.8.2016న పోలీసులు మిలీనియం కాలనీకి వెళ్లగా.. నయీమ్, అతని డ్రైవర్‌ కాలనీలోని ప్రవేశిస్తున్నారు. పోలీసులను చూసిన నయీమ్‌ కాల్పులు ప్రారంభించి, తప్పించుకునే ప్రయత్నం చేశాడు. లొంగిపోవాలని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం ఇవ్వొద్దంటూ పోలీసులు వారిని హెచ్చరించారు.

అయినా వారు పోలీసులపై ఏకే 47 తుపాకీలో కాల్పులు జరుపుతూనే ఉండడంతో.. పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు ప్రారంభించారు. దీంతో నయీమ్‌ అక్కడిక్కడే మరణించాడు. ఈ ఘటనపై షాద్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. కూకట్‌పల్లి ఏసీపీకి దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. మిలీనియం కాలనీలోని నయీమ్‌ డెన్‌పై పోలీసులు దాడులు చేసి రివాల్వర్లు, స్టెన్‌ గన్, రెండు ఏకే 47 తుపాకులు, 17 సెల్‌ఫోన్లు, రెండు కార్లు, ఒక స్కూటీ, రూ.3.74 లక్షల నగదు, 5.5 తులాల బంగారు ఆభరణాలు, వ్యవసాయ భూములు, ఇళ్ల ప్లాట్లకు సంబంధించి పెద్ద సంఖ్యలో డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

167 కేసులు.. 848 మంది సాక్షులు..
పోలీసులు నయీమ్‌ సోదరి సలీమా బేగం, భార్య హసీనా, బంధువులు మాతేన్, కలీమాలను డెన్‌ వద్దే అరెస్ట్‌ చేశారు. రాష్ట్ర డీజీపీ 10.8.16న ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు నిమిత్తం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేశారు. నార్త్‌జోన్‌ ఐజీపీ వై.నాగిరెడ్డిని సిట్‌కు ఇన్‌చార్జిగా నియమించారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా భువనగిరి, మిర్యాలగూడ, వనస్థలిపురం, నార్సింగి, కోరుట్ల, కరీంనగర్‌ తదితర చోట్ల దాడులు నిర్వహించి.. పిస్టళ్లు, రివాల్వర్లు, ఆస్తి డాక్యుమెంట్లు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ పలు చోట్ల దాడులు చేసి నయీమ్‌ కుటుంబ సభ్యుల పేరు మీద పలు ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం దర్యాప్తు మరింత పకడ్బందీగా, సమర్థవంతంగా జరిగేందుకు వీలుగా దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యతలను అదనపు డీజీ అంజనీ కుమార్‌కు డీజీపీ అప్పగించారు. దీంతో ఆయన నాలుగు దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు.

మొత్తంగా ఈ వ్యవహారంలో 167 కేసులు నమోదు చేశారు, 8 పాత కేసులను మళ్లీ తెరిచారు. ఇందులో 10 కేసులు సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో, 135 కేసులు రాచకొండ కమిషనరేట్, 2 కేసులు సిద్దిపేట కమిషనరేట్, 3 కేసులు కరీంనగర్‌ కమిషనరేట్, 2 కేసులు వరంగల్‌ కమిషనరేట్, 2 కేసులు జగిత్యాల జిల్లా, ఒక కేసు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఒక కేసు మెదక్‌ జిల్లాకు సంబంధించినవి. అన్ని కేసుల్లో 116 మంది నిందితులను అరెస్ట్‌ చేశారు. 8 మంది నిందితులు సంబంధిత కోర్టుల ముందు లొంగిపోయారు. దర్యాప్తు నిమిత్తం 103 మంది నిందితులను పోలీసు కస్టడీకి తీసుకోవడం జరిగింది. దర్యాప్తులో భాగంగా 848 మంది సాక్షులను విచారించి, వాంగ్మూలాలను నమోదు చేశారు. మరో 217 మంది సాక్షులను విచారించాల్సి ఉంది. 16 కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేశారు. మిగతా కేసుల్లో చార్జిషీట్‌ దాఖలు ప్రక్రియ తుది దశలో ఉంది.

పిటిషనర్‌వన్నీ నిరాధార ఆరోపణలు
నయీమ్, అతడి బంధువులు, బినామీలు రాష్ట్రంలో పలు ప్రదేశాల్లో ఆస్తులు కలిగినట్లు తేలింది. రాష్ట్రం వెలుపల నుంచి ఎటువంటి ఫిర్యాదులూ రాలేదు. రాష్ట్రం వెలుపల నయీమ్, అతని అనుచరులు ఆశ్రయం పొందేందుకు కొన్ని ఇళ్లను కలిగి ఉన్నట్లు తేలింది. నయీమ్‌కు నక్సలైట్లతో సంబంధమున్నట్లు ఇప్పటి వరకు ఎటువంటి సాక్ష్యాలు లభించలేదు. దావూద్‌ ఇబ్రహీంతో నయీమ్‌ మాట్లాడారనే విషయంలో ఎటువంటి సమాచారం లేదు. ఆధారాలు లభిస్తే సిట్‌ తగిన చర్యలు తీసుకుంటుంది. నయీమ్‌ సేవలను పోలీసులు వాడుకోవడంగానీ, అతనితో కుమ్మక్కు కావడంగానీ జరగలేదు. ఈ విషయంలో వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నాం. నయీమ్‌ ద్వారా పోలీసు అధికారులు లబ్ధి పొందారన్న ఆరోపణలు నిరాధారమైనవి. సోహ్రబుద్దీన్‌ కేసులో కూడా నయీమ్‌ సీబీఐ వాటెండ్‌ జాబితాలో ఉన్నారని చెబుతున్న పిటిషనర్‌.. అందుకు ఎటువంటి ఆధారాలను చూపలేదు. అలాగే నక్సలైట్ల కదలికలపై సమాచారం తెలిపే నిమిత్తం నయీమ్‌కు ప్రభుత్వం రూ.25 లక్షలు చెల్లించదన్న ఆరోపణలకు సైతం ఆధారాలను చూపడం లేదు. ఆధారాలు లేని ఆ ఆరోపణలను ఖండిస్తున్నాం. గతంలో నయీమ్‌ను అనేక కేసుల్లో అరెస్టు చేశారు. తరువాత బెయిల్‌పై విడుదలయ్యాడు.

రాజకీయ నేతలతో సంబంధాల్లేవ్‌!
నయీమ్‌తో సంబంధమున్న పోలీసులను, రాజకీయ నాయకులను కాపాడేందుకు సిట్‌ కంటి తుడుపుగా దర్యాప్తు చేస్తోందన్న పిటిషనర్‌ ఆరోపణ పూర్తిగా నిరాధారం. నయీమ్‌ బాధితులుగా చెప్పుకొంటూ ఇప్పటికీ అనేక మంది సిట్‌ ముందుకు వస్తున్నారు. ప్రతీ ఆరోపణపై సిట్‌ సమగ్రంగా దర్యాప్తు చేస్తోంది, ప్రతి సాక్ష్యాన్ని నమోదు చేస్తోంది. నయీమ్‌కు ఏపీ, గోవా, ఇతర రాష్ట్రాల్లో ఆస్తులు, ఏజెంట్లు ఉన్న ఆరోపణలకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. ఏపీ, గోవా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో కొన్ని ఇళ్లను గుర్తించాం. కొందరు ప్రముఖ రాజకీయ నాయకులు నయీమ్‌ సేవలను ఉపయోగించుకుని ఆర్థిక ప్రయోజనాలు పొందారన్న పిటిషనర్‌ ఆరోపణల్లో వాస్తవం లేదు. ఉమ్మడి రాష్ట్ర మాజీ డీజీపీ, మాజీ మంత్రిపై పిటిషనర్‌ చేసిన ఆరోపణలు కేవలం ఊహాజనితమైనవే.

ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి సాక్ష్యం లభించలేదు. తదుపరి దర్యాప్తులో ఏవైనా ఆధారాలు లభిస్తే తగిన చర్యలు తీసుకుంటాం. నయీమ్‌ కొందరు చిన్నారులను తన రక్షణ కవచాలుగా, లైంగిక కార్యకలాపాలకు వాడుకున్నారనేందుకు కొన్ని ఆధారాలు లభించాయి. షాద్‌నగర్, నర్సింగిల్లోని నయీమ్‌ డెన్‌ల నుంచి ఆరుగురు మైనర్లను రక్షించి, వారిని రక్షిత గృహాలకు పంపాం. నయీమ్‌ తమను ఏ విధంగా లైంగికంగా వాడుకున్నాడో ఆ చిన్నారులు వివరించగా.. వాంగ్మూలంగా నమోదు చేశాం. నయీమ్‌ విదేశాలకు వెళ్లేందుకు ప్రణాళికలు రచించారనేందుకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. పోలీసు అధికారి కేఎస్‌ వ్యాస్‌ హత్యకు ప్రయత్నించినందుకు నయీమ్‌ను గతంలో అరెస్టు చేశాం.

దర్యాప్తు సంతృప్తికరంగా సాగుతోంది
పోలీసులు దర్యాప్తులో భాగంగా ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య, అదనపు ఎస్పీ (రిటైర్డ్‌) సీహెచ్‌.రవీందర్‌రెడ్డి, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ సీతారామ్, ఇన్‌స్పెక్టర్‌ బి.కిషన్, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.శ్రీనివాస్‌నాయుడు, హయత్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ జె.నరేందర్‌గౌడ్, గోపాలపురం ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ మహ్మద్‌ మాజీద్, టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బలవంతయ్య, మలక్‌పేట ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.వెంకట్‌రెడ్డి, నల్లగొండ సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఈ.రవీందర్, ఏసీబీ కరీంనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ తదితరులకు నోటీసులు జారీ చేసి నయీమ్‌తో సంబంధాలపై విచారించడం జరిగింది. ప్రజల్లో విశ్వాసం కలిగించేలా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పిటిషనర్‌ రాజకీయ ప్రయోజనాలను ఆశించే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సినంత ప్రత్యేక పరిస్థితులేవీ లేవు. సీబీఐకి ఎందుకు అప్పగించాలో వివరించేందుకు పిటిషనర్‌ తగిన ఆధారాలను సమర్పించలేదు. పోలీసులు నిష్పాక్షికంగా, వేగవంతంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement