
నయీం కేసులో కీలక పరిణామం
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం అక్రమాలకు సంబంధించిన కేసులో కీలక పరిణామాం చోటుచేసుకుంది. ఇన్నాళ్లూ చెబుతూ వస్తున్నట్లుగా నయీంకు రాజకీయ నాయకులతోగానీ, పోలీసు అధికారులతోగానీ సంబంధాలు లేనేలేవని సాక్షాత్తు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. గురువారం హైకోర్టులో దాఖలుచేసిన కౌంటర్ పిటిషన్‌లో తెలంగాణ హోం శాఖ పలు సంచలన విషయాలను ప్రస్తావించింది. నయీం కేసులను సీబీఐకి అప్పగించాలని కోరుతూ సీపీఐ నేత నారాయణ దాఖలు చేసిన పిటిషన్‌కు కౌంటర్‌గా ప్రభుత్వం ఈ కౌంటర్ పిటిషన్ వేసింది. (నయీం కేసుపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఏమన్నారంటే..)
'రాజకీయ నాయకులతో, పోలీసులు అధికారులతో నయీంకు ఎలాంటి సంబంధాలు లేవు. ఒక మాజీ డీజీపీ నయీంకు సహకరించారనే ఆరోపణలు కూడా అవాస్తవం. అంతర్జాతీయ ఉగ్రవాది, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో నయీంకు సంబంధాలున్నాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవు'అని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. నయీం కేసులను ప్రత్యేక దర్యాప్తు బృందమే(సిట్) పర్యవేక్షిస్తుందని, దర్యాప్తును సీబీఐకి అప్పగించే ఆలోచన లేనేలేదని స్పష్టం చేసింది. గ్యాంగ్‌స్టర్ నయీం కేసుపై సీపీఐ నేత నారాయణ దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. విచారణ నివేదిక సమర్పించటంతో పాటు, కౌంటర్ దాఖలు చేయాలని మూడు వారాల కిందట తెలంగాణ హోం శాఖను ఆదేశించించింది. గురువారంతో గడువు ముగియనుండటంతో హోంశాఖ ఈ మేరకు కౌంటర్ దాఖలుచేసింది.