చింతల్: గురుమూర్తి నగర్‌లో ఆందోళనతో టీవీ చూస్తున్న నేపాలీలు
తమ వారు ఎలా ఉన్నారో... ఎక్కడ ఉన్నారో... అసలేమయ్యారో తెలీదు. ఫోన్‌లో మాట్లాడే అవకాశం లేదు. తమ బంధువుల క్షేమ సమాచారం తెలిపే దిక్కులేదు. ఏ రూపంలో తెలుసుకోవాలో తెలియడం లేదు. టీవీల్లో చూపించే మృతులు...క్షతగాత్రుల్లో తమ వారు ఉండకూడదని దేవుణ్ణి ప్రార్థించడం తప్ప... మరో దారిలేక వారంతా తల్లడిల్లుతున్నారు. ఇదీ ఉపాధి కోసం వలస వచ్చి... నగరంలో ఉంటున్న నేపాలీల దుస్థితి. తమ దేశంలో భూకంపం సంభవించిందన్న వార్త వీరి గుండెల్లో పెను ప్రకంపనలు సృష్టించింది.
కుత్బుల్లాపూర్: నేపాల్ భూకంపం నగరంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. గ్రేటర్‌లోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న నేపాలీలు భయాందోళనకు గురయ్యారు. ఖాట్మండు, లాంజంగ్ తదితర ప్రాంతాల్లోని తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు ఏమైందోనని తల్లడిల్లిపోతున్నారు. ఈ ఘోర విపత్తుకు సంబంధించిన వార్తలు చూసేందుకు టీవీలకు అతుక్కుపోయారు. సెల్‌ఫోన్ ల ద్వారా అక్కడి అధికారులను, బంధువులను సంప్రదించేందుకు ప్రయత్నించారు.
చాలాచోట్ల సెల్‌ఫోన్లు పని చేయకపోవడం... అక్కడి వారి క్షేమ సమాచారం తె లియకపోవడంతో వీరి ఆందోళన అధికమవుతోంది. తమ వారి సమాచారం తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నేపాల్‌లోని వివిధ ప్రాంతాల వారు ఉపాధి కోసం నగరానికి తరలి వచ్చి... జీడిమెట్ల, బాలానగర్, ఐడీపీఎల్, చింతల్ తదితర పారిశ్రామికవాడల్లో నివసిస్తున్నారు. శనివారం నాటి భూకంపం సంఘటన తో వీరు భీతావహులయ్యారు.
మా అన్న ఆచూకీ తెలియడం లేదు: నామ్‌షారా
భూకంపం వార్త తెలిసినప్పటి నుంచి మా అన్న కోసం ప్రయత్నిస్తున్నాను. నేను పనికి వెళ్లడంతో చాలా సేపటి వరకు సంఘటన గురించి తెలియలేదు. నా దగ్గర సెల్‌ఫోన్ లేదు. ఇంట్లో టీవీ కూడా లేదు. బంధువుల ఇంటికి వెళ్లి మా అన్న సమాచారం తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాను.
ఫోన్‌లు కలవడం లేదు: గంగాదేవి
మా అమ్మాయి, అల్లుడు లాంజంగ్ తాన్‌సింగ్‌లో ఉంటున్నారు. నేపాల్‌లో భూకంపం వచ్చిందన్న విషయం టీవీలో చూశాం. అప్పటి నుంచి వాళ్లతో ఫోన్‌లో మాట్లాడదామని ప్రయత్నిస్తున్నాం. కానీ కలవడం లేదు. చాలా భయంగా ఉంది. వారు క్షేమంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నా.
హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలి: మాయాగురు
నేపాల్‌లో భూకంపం వచ్చి చాలా మంది చనిపోయారని టీవీలో చూసి షాక్‌కు గురయ్యాం. అక్కడ మావాళ్లు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి ఫోన్లు కూడా పని చేయడం లేదు. వారి యోగ క్షేమాల కోసం నగరంలో ఏదైనా హెల్ప్ డెస్క్ పెడితే ఉపయోగపడుతుంది. భూకంపం జరిగిన ప్రాంతంలోనే మా అన్న, వదినలు ఉంటున్నారు.
భయంగా ఉంది : మీనా
మా అన్న, అక్క క్షేమంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నా. భూకంపం వచ్చిందన్న సమాచారం తెలియడంతోనే టీవీల దగ్గర కూర్చున్నాం. అక్కడి దృశ్యాలను చూస్తుంటే చాలా భయంగా ఉంది. చింతల్ గురుమూర్తి నగర్ షామా కాంప్లెక్స్‌లో నేపాల్‌కు చెందిన 10 కుటుంబాల వాళ్లం నివసిస్తున్నాం. భూకంపం గురించి తెలియడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాం.