
వరదొస్తే రైళ్లకు దేవుడే దిక్కు
- రాష్ట్ర ప్రభుత్వాలతో రైల్వేకు తెగిన సమన్వయం
- ఉన్నట్టుండి వరదలు వస్తే ‘రైల్వే’కు సమాచారం కరవు
- తాజాగా జరిగిన ‘వలిగొండ ఘటన’కు ఇదే కారణం
సాక్షి, హైదరాబాద్: వందల మందితో ప్రయాణించే రైళ్లు అత్యంత ప్రమాదకర స్థితిలో పరుగు పెడుతున్నాయి. భారీ వానలు కురిసి ఉన్నట్టుండి వరదలు వస్తే రైల్వే శాఖకు సమాచారం ఉండటం లేదు. ఆ సమయంలో పట్టాల కింద మట్టి కొట్టుకుపోతే అవి పడిపోయే పరిస్థితి పొంచి ఉంది. దీన్ని నిరోధించేందుకు గతంలో అమలైన విధానం ఇప్పుడు అటకెక్కింది. రాష్ట్ర విభజనతో సమస్య తీవ్రమైంది. రెండు రోజుల క్రితం నల్లగొండ జిల్లా వలిగొండ వద్ద ట్రాక్ దిగువన మట్టి కొట్టుకుపోయి పట్టాలు గాలిలో తేలే పరిస్థితి ఉత్పన్నమైనా రైల్వేకు సమాచారం లేకపోవటానికి ఇదే కారణం. రైతులు పసిగట్టి రైలును ఆపి ఉండకపోతే మరో భారీ ప్రమాదం చోటుచేసుకుని ఉండేది.
వరదల సమాచారమే తెలియడం లేదు
భారీ వర్షాలు కురిసిన ప్పుడు రైల్వే ట్రాక్‌కు చేరువగా ఉన్న చెరువులు, వాగులు, నదుల పరిస్థితిని నీటిపారుదల శాఖ ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తేవాలి. రాష్ట్రప్రభుత్వం ఆ వివరాలను రైల్వేకు చేరవేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందస్తు హెచ్చరికలు రాగానే ఆయా ప్రాంతాలకు గ్యాంగ్‌మెన్ చేరుకుని ట్రాక్‌ను తనిఖీ చేస్తారు. దీంతోపాటు ఇటు రైల్వే, అటు రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందితో సంయుక్త బృందాలు కూడా ఉండేవి. వాతావరణ పరిస్థితులకు సంబంధించి ముందస్తు సమాచారం ఆధారంగా వరదలపై అంచనాకొచ్చి ఈ సమన్వయ బృందాలు ఆయా ప్రాంతాలపై దృష్టి సారిస్తాయి. ఇప్పుడు ఈ బృందాలు కూడా మనుగడలో లేకుండా పోయాయి. రెండు రోజుల క్రితం భారీ వర్షం కురిసి వలిగొండ సమీపంలో ఉన్నట్టుండి వచ్చిన వరద అక్కడి ఆర్‌యూబీ సమీపంలో పట్టాల కింద మట్టిని చెల్లాచెదురు చేసింది. కానీ అక్కడ వరద గురించి రైల్వేకు సమాచారం అందలేదు. సొంతంగా దాన్ని గుర్తించే వ్యవస్థ రైల్వేకు లేదు. ఎక్కడికక్కడ రాష్ట్రప్రభుత్వాల సహకారంతో గుర్తించక తప్పని పరిస్థితి. కానీ ఇప్పుడు ఇటు తెలంగాణ నుంచి అటు ఆంధ్రప్రదేశ్ నుంచి రైల్వేకు ఈ సమాచారం అందటం లేదు.
పదేళ్ల క్రితం 2005 నవంబరులో గంట వ్యవధిలో 32 సెం.మీ. వర్షం కురియడంతో నల్లగొండ జిల్లా వలిగొండ రైలు వంతెన వద్ద మట్టి కొట్టుకుపోయి పట్టాలు గాల్లో తేలిపోయాయి. సమాచారం లేక దూసుకొచ్చిన రేపల్లె-సికింద్రాబాద్ ప్యాసింజర్ నదిలో పడిపోయింది. లోకో పైలట్ సహా 115 మంది దుర్మరణం చెందారు. అప్పుడు మెరుపు వరద సమాచారం రైల్వేకు లేకపోవటంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంతో రైల్వేకు కచ్చితంగా సమన్వయం ఉండాలని తేల్చి కొంతకాలం దాన్ని అమలు చేశారు. విభజన తర్వాత మళ్లీ సమన్వయం దెబ్బతింది.