ఏ ఒక్క ఉద్యోగీ ఆంధ్రకు వెళ్లడు
తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్ స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: ఏ ఒక్క తెలంగాణ ఉద్యోగి ఆంధ్ర ప్రాంతానికి వెళ్లాలనే ఆలోచనలో లేడని టీజేఏసీ కో చైర్మన్, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్ శనివారం స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితిని 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచిన నేపథ్యంలో దాదాపు 10 వేల మంది తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని పత్రికల్లో (సాక్షి కాదు) ఊహా జనిత వార్తలు రాశారని ఆయన మండిపడ్డారు.
పదవీ విరమణ పరిమితిని 60 ఏళ్లకే కాదు 120 ఏళ్లకు పెంచినా ఏ ఒక్క తెలంగాణ ఉద్యోగి ఆంధ్రకు వెళ్లడని కరాఖండిగా తేల్చి చెప్పారు. కింది స్థాయి నుంచి గ్రూప్-1 స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ ఈ ప్రాంత ఆత్మగౌరవం కోసం పోరాడినవారేనని.. వీరిలో ఏ ఒక్కరూ ఆంధ్రకు వెళ్లడానికి మానసికంగా, భౌతికంగా సిద్ధంగా లేరన్నారు. ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ పి. మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ .. కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలు వెల్లడించకుండా మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. కమిటీపై రాజకీయ ఒత్తిళ్లు పనిచేస్తుండడంతోనే ఆలస్యం జరుగుతోందని ఆయన ఆరోపించారు.