'మా పరిధిలో పబ్‌లకు అనుమతి లేదు'
నాగోలు: రాచకొండ కమిషనరేట్ పరిధిలో పబ్బులకు ఎలాంటి అనుమతులు లేవని, ఎవరైనా ఆ పేరుతో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ పేర్కొన్నారు. మంగళవారం సైబరాబాద్ సీపీ క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకమయ్యారు.
అనంతరం మాట్లాడుతూ.. ఎవరైనా మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తించినట్లయితే 100 నెంబర్‌కు గాని, సైబరాబాద్ వాట్సాప్ నెంబర్-9490617111కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. స్పోర్ట్స్ బార్‌ల పేరుతో నిర్వహిస్తున్నవాటిపై విచారణ చేపడతామని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే ఎంతటివారైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే కొత్తపేట స్వాగత్‌గ్రాండ్ హోటల్‌పై సెక్షన్-21/70 కింద మేనేజర్ రఘుపై కేసు నమోదు చేశామని, ఇక ముందు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే స్పోర్ట్స్ బార్ యజమానిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు.
బార్‌లు, హోటళ్లలో చట్టవిరుద్ధంగా ఎవరైనా వ్యవహరించినట్లయితే చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన సమయం ప్రకారమే బార్లు నడవాలన్నారు. సివిల్ తగాదాలను పోలీస్‌స్టేషన్‌కు తీసుకురావొద్దని, కోర్టులోనే చూసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎల్‌బీ నగర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడినవారికి కౌన్సెలింగ్ నిర్వహించే కార్యక్రమంలో సీపీ పాల్గొని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.