Rachakonda commissionarate
-
చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో నిందితులుగా పేరెంట్స్!
పాపం పసివాళ్లు. అభం శుభం తెలియని పసి మనసులు.. అటు కన్నవారికి ఇప్పుడు ఇటు పెంచిన మమకారానికి దూరం కావడంతో తల్లడిల్లిపోతున్నాయి. ఇంతకాలం తమ బిడ్డలేనని మురిసిపోయిన ఆ తల్లులు బరువెక్కిన హృదయంతో కంటతడి పెడుతున్నారు. పోలీసులు ఆ చిన్నారుల్ని తీసుకెళ్తుంటే వాహనాల వెంట పరుగులు పెడుతున్న దృశ్యాలు బాధ కలిగిస్తున్నాయి. హైదరాబాద్, సాక్షి: నగరంలో కలకలం రేపిన చైల్డ్ ట్రాఫికింగ్ వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇందుకోసం ఢిల్లీ వెళ్లిన రాచకొండ కమిషనరేట్ బృందాలు.. విక్రయ ముఠా కోసం గాలింపు చేపట్టాయి. పోలీసుల అదుపులో ఉన్న ముఠా సభ్యులు అందించిన సమాచారం ప్రకారం.. కిరణ్, ప్రీతిలను కీలక సూత్రధారులుగా నిర్ధారించుకున్నారు. ఈ ముఠా ఇప్పటివరకు 50 మందికి విక్రయించినట్లు తేలింది. గుంటూరు, విజయవాడ, కరీంనగర్.. తెలుగు రాష్ట్రాల్లో ఆ పిల్లల్ని అమ్మేసినట్లు గుర్తించింది. అయితే.. ఇప్పటివరకు 16 మంది చిన్నారులను రక్షించిన పోలీసులు.. ఇటు నిందితులతో పాటు అటు మిగిలిన 34 మంది చిన్నారుల ఆచూకీ కోసం, ఇంకోవైపు ఈ పిల్లల అసలు తల్లిదండ్రులు ఎవరు? అనే అంశాలపై విడివిడిగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అదే సమయంలో 13 మంది పిల్లల్ని కొనుగోలు చేసిన తల్లిదండ్రులపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో ఆ పేరెంట్స్‌ను నిందితులుగా ఈ కేసులో చేర్చారు. దీంతో వాళ్లంతా లబోదిబోమంటున్నారు.ఇదీ చదవండి: వాట్సాప్‌లో ఫొటోలు.. ముహూర్తం రోజున డెలివరీ.. -
ప్రజలంతా కర్ఫ్యూకి సహకరించాలి: మహేష్ భగవత్
సాక్షి, హైదరాబాద్: నగర వాసులు నైట్ కర్ఫ్యూని విధిగా పాటించాలని రాచకొండ కమిషనరేట్ సీపీ మహేష్ భగవత్ కోరారు. సెకండ్ వేవ్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని.. ఇప్పటికే రాష్ట్రంలో 5,900 కేసులు నమోదు అయ్యాయన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో ఈరోజు నుంచి మే1 ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. బార్లు, హోటల్స్, రెస్టారెంట్లు, మాల్స్, షాప్స్ రాత్రి ఎనిమిది గంటలకు ముసివేయాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు, మెడికల్, ఎమర్జెన్సీ సర్విస్, మీడీయా ఉద్యోగులు ఐడికార్డ్స్ వెంట పెట్టుకోవాలి అని సూచించారు. ఇక ‘‘నగరం మొత్తం మీద 46 చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశాం. చాలా సీరియస్‌గా కర్ఫ్యూ అమలు ఉంటుంది. కర్ఫ్యూ నిర్వహణలో భాగంగా పాట్రోల్ మోబైల్స్, బ్లూ కోట్స్ రంగంలోకి దింపాము. నిభందనలు ఉల్లంఘించిన వారిపై సెక్షన్ 51 నుంచి 60 వరకు డిజార్డర్ మానేజ్ మెంట్, ఐపీసీ సెక్షన్ 188 కింద కేసులు నమోదు చేస్తాం. మాస్క్ ధరించకుంటే వెయ్యిరూపాలు జరిమానా విధిస్తాం. ప్రతి ఒక్కరు విధిగా మాస్క్, శానిటైజేషన్, సోషల్ డిస్టెన్స్ పాటించాలి. ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలి’’ అని కోరారు. చదవండి: నైట్ కర్ఫ్యూ: మెట్రో సేవల్లో మార్పులివే.. -
ఒక్క నెల.. 4.8 కోట్లు..
సాక్షి, హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డు.. ఖాళీగా కనిపిస్తే చాలు వాహనదారులు రయ్యిమంటూ దూసుకుపోతు న్నారు. జామ్.. జామ్.. అంటూ సాగిపోతున్నారు. కానీ రెండు మూడ్రోజులకు ఈ–చలాన్ వచ్చి చుక్కలు కనిపించేలా చేస్తుంది. సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 158 కిలోమీటర్ల మేర ఉన్న ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తున్నవారిని లేజర్‌గన్ స్పీడ్ కెమెరాల ద్వారా క్లిక్‌మనిపించి ఇంటికే చలాన్లు పంపుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు చలాన్ల జారీని పరిశీలిస్తే.. ప్రతి నెలా రూ.4.8 కోట్లు ట్రాఫిక్ పోలీసు విభాగానికి వాహన దారులు చెల్లిస్తున్నారు. ఇరు కమిషనరేట్ల పోలీసులు కలసి తొమ్మిది లేజర్‌గన్ కెమెరాల ద్వారా వాహనదారుల అధిక వేగాన్ని నిర్ధారిస్తున్నారు. వేగం తగ్గించినా మారని తీరు... ఓఆర్ఆర్పై వాహనాల గరిష్ట వేగాన్ని 100 కిలో మీటర్లకు తగ్గించినా వాహనదారుల్లో స్పీడ్ జోష్ మాత్రం తగ్గలేదు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఢిల్లీకి చెందిన సెంట్రల్ రోడ్డు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధ్యయనంలో తేలినా వాహనదారులు తగ్గడంలేదు. ఈ ఏడాది జరిగిన 82 రోడ్డు ప్రమాదాల్లో 33 మంది మృతి చెందారు. ఓఆర్ఆర్ నిర్వహణను చూస్తున్న హెచ్ఎండీఏ అధికారులు కూడా కొన్ని ప్రాంతాల్లో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం కూడా వాహనదారులు అక్కడికక్కడే దుర్మరణం చెందడానికి కారణమవుతోంది. డ్రంకన్ డ్రైవ్‌పై ప్రత్యేక నిఘా... ఈ రోడ్డు ప్రమాదాలకు కారణం కొన్ని సందర్భాల్లో డ్రంకన్ డ్రైవ్ అని తేలడంతో సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇలా ఈ ఏడాది 1,836 వరకు కేసులు నమోదు చేశారు. వీరిలో 430 మందికి ఒకటి నుంచి మూడు రోజుల పాటు జైలు శిక్ష పడింది. ఇతరులకు న్యాయస్థానం రూ.45 లక్షల వరకు జరిమానా విధించింది. అటు లేజర్ గన్ కెమరాలు, ఇటు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలతో ఓఆర్ఆర్ను రోడ్డు ప్రమాద రహితంగా మార్చడంపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు తగ్గాయని చెబుతున్నారు. ఆటోమేటిక్‌తో ఈ–చలాన్.. ఇప్పటివరకు ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ పోలీసులు తాము ఎంచుకున్న ప్రాంతాల్లో లేజర్ గన్ కెమెరాతో వాహనదారుల స్పీడ్‌ను గమనిస్తున్నారు. ఇకపై ఈ వెతలు తీరున్నాయి. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఓఆర్ఆర్పై ప్రయోగాత్మకంగా ఆటోమేటిక్ కెమెరా రాడార్ల సాయంతో వాహనాల వేగాన్ని గుర్తించి చలాన్ జనరేట్ చేయనుంది. ఈ లేజర్ గన్ కెమెరా ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సందర్శించి పనితీరు తెలుసుకున్నారు. ఇది విజయవంతమైతే ఓఆర్ఆర్ అంతటా ఇదే విధానాన్ని అనుసరించనున్నారు. ఓఆర్ఆర్ విస్తీర్ణం : 158 కిలోమీటర్లు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో కేసులు : 2,31,795 సైబరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో నమోదైన డ్రంకెన్ డ్రైవ్ కేసులు : 1,569 జరిమానా : రూ.23,92,75,225 రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో కేసులు : 96,628 జరిమానా : రూ.9,97,90,880 7 నెలల కాలంలో వాహనదారులకు అందిన ఈ–చలాన్ల మొత్తం : రూ. 34కోట్లు -
పాత కరెన్సీ మార్పిడి ముఠా గుట్టురట్టు
సాక్షి, ఉప్పల్(హైదరాబాద్): ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో పాత కరెన్సీ చలామణి చేస్తున్న ముఠా గుట్టును మల్కాజిగిరి జోన్ ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. ఇందులో కీలకపాత్ర పోషించిన ఇద్దరితోపాటు ఒక జువైనల్‌ను అరెస్టు చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్ పీఎస్‌లో మల్కాజిగిరి ఏసీపీ సందీప్ రావు బుధవారం మీడియాకు వివరాలు తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన మహమ్మద్ హఫీజ్ హైదరాబాద్ వచ్చి ముర్గీచౌక్‌లో గాజులు తయారు చేస్తున్నాడు. తలాబ్ కట్టకు చెందిన ఆదిల్, ఘాజీ బజార్‌కు చెందిన బాబుభాయ్, మరొక మైనర్‌తో కలిసి లక్షకు ఇరవై శాతం కమీషన్‌తో పాత కరెన్సీ మార్పిడి చేస్తామని నమ్మబలికి సన్నిహితులు, మిత్రులు, బంధువుల నుంచి దాదాపు రూ.75 లక్షలకు పాత కరెన్సీని సేకరించారు. ప్రధాన నిందితుడు హఫీజ్ బుధవారం ఉప్పల్ ప్రశాంత్‌నగర్‌లో తన దగ్గర ఉన్న రూ.74 లక్షల 71 వేలను ప్లాస్టిక్ కవర్లో చుట్టి రెండు మోటర్ సైకిళ్లపై దాచిపెట్టి మధ్యవర్తుల కోసం ఆదిల్‌తో కలిసి ఎదురు చూస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.74.71 లక్షల విలువ జేసే పాత కరెన్సీ, రెండు బైకులు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా, మరో నిందితుడు బాబూభాయ్ పరారీలో ఉండగా మైనర్‌ను కూడా అదుపులోకి తీసుకుని అతడిని జువైనల్ హోమ్‌కు తరలించారు. -
కానిస్టేబుల్ పోస్టులకు సర్టిఫికేట్ల పరిశీలన
ఇటీవల వెలువడిన కానిస్టేబుల్ ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ పలు సూచనలు విడుదల చేసింది. - 2015వ సంవత్సరంలో సైబరాబాద్-2, 1వ బెటాలియన్ యూసఫ్‌గూడలోని(హైదరాబాద్ జిల్లా) పిఎంటీ/పిఈటీకి హాజరైన అభ్యర్థులు ఈ నెల 8 నుంచి 10వ తారీఖు వరకు ఉదయం 10.30కు గెజిటెడ్ ఆఫీసర్‌తో సంతకం చేయించిన వారి ఒరిజినల్ సర్టిఫికెట్లు, వాటి జిరాక్స్ కాపీలను గచ్చిబౌలి లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో సమర్పించాలి. - అభ్యర్థులు అటెస్టేషన్ ఫారాలను తప్పనిసరిగా సొంత దస్తూరితో నింపాలి. - సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం అభ్యర్థులు మెడికల్ టెస్టుకు హాజరుకావాల్సి ఉంటుంది. - ఏయే రోజు ఎవరెవరు హాజరు కావాలననే వివరాలు tslprb వెబ్ సైట్ లో ఉంటాయి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా వివరాలను చూసుకోవచ్చు. - ఈ నెల 7వ తారీఖు ఉదయం 10గంటల నుంచి అభ్యర్థులు ఇంటిమేషన్ లెటర్లను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇందుకోసం ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ ను ఎంటర్ చేయాలి. - అభ్యర్థులు అటెస్టేషన్ ఫార్మ్ ను నింపకున్నా, సర్టిఫికెట్ పరిశీలనకు హాజరుకాకున్నా, మెడికల్ పరీక్షలో విఫలమైనా వారి అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తారు. -
'మా పరిధిలో పబ్‌లకు అనుమతి లేదు'
నాగోలు: రాచకొండ కమిషనరేట్ పరిధిలో పబ్బులకు ఎలాంటి అనుమతులు లేవని, ఎవరైనా ఆ పేరుతో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ పేర్కొన్నారు. మంగళవారం సైబరాబాద్ సీపీ క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకమయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. ఎవరైనా మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తించినట్లయితే 100 నెంబర్‌కు గాని, సైబరాబాద్ వాట్సాప్ నెంబర్-9490617111కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. స్పోర్ట్స్ బార్ల పేరుతో నిర్వహిస్తున్నవాటిపై విచారణ చేపడతామని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే ఎంతటివారైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే కొత్తపేట స్వాగత్‌గ్రాండ్ హోటల్‌పై సెక్షన్-21/70 కింద మేనేజర్ రఘుపై కేసు నమోదు చేశామని, ఇక ముందు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే స్పోర్ట్స్ బార్ యజమానిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. బార్లు, హోటళ్లలో చట్టవిరుద్ధంగా ఎవరైనా వ్యవహరించినట్లయితే చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన సమయం ప్రకారమే బార్లు నడవాలన్నారు. సివిల్ తగాదాలను పోలీస్‌స్టేషన్‌కు తీసుకురావొద్దని, కోర్టులోనే చూసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎల్బీ నగర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడినవారికి కౌన్సెలింగ్ నిర్వహించే కార్యక్రమంలో సీపీ పాల్గొని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.