పాపం పసివాళ్లు. అభం శుభం తెలియని పసి మనసులు.. అటు కన్నవారికి ఇప్పుడు ఇటు పెంచిన మమకారానికి దూరం కావడంతో తల్లడిల్లిపోతున్నాయి. ఇంతకాలం తమ బిడ్డలేనని మురిసిపోయిన ఆ తల్లులు బరువెక్కిన హృదయంతో కంటతడి పెడుతున్నారు. పోలీసులు ఆ చిన్నారుల్ని తీసుకెళ్తుంటే వాహనాల వెంట పరుగులు పెడుతున్న దృశ్యాలు బాధ కలిగిస్తున్నాయి.
హైదరాబాద్, సాక్షి: నగరంలో కలకలం రేపిన చైల్డ్ ట్రాఫికింగ్ వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇందుకోసం ఢిల్లీ వెళ్లిన రాచకొండ కమిషనరేట్ బృందాలు.. విక్రయ ముఠా కోసం గాలింపు చేపట్టాయి. పోలీసుల అదుపులో ఉన్న ముఠా సభ్యులు అందించిన సమాచారం ప్రకారం.. కిరణ్, ప్రీతిలను కీలక సూత్రధారులుగా నిర్ధారించుకున్నారు.
ఈ ముఠా ఇప్పటివరకు 50 మందికి విక్రయించినట్లు తేలింది. గుంటూరు, విజయవాడ, కరీంనగర్.. తెలుగు రాష్ట్రాల్లో ఆ పిల్లల్ని అమ్మేసినట్లు గుర్తించింది. అయితే.. ఇప్పటివరకు 16 మంది చిన్నారులను రక్షించిన పోలీసులు.. ఇటు నిందితులతో పాటు అటు మిగిలిన 34 మంది చిన్నారుల ఆచూకీ కోసం, ఇంకోవైపు ఈ పిల్లల అసలు తల్లిదండ్రులు ఎవరు? అనే అంశాలపై విడివిడిగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
అదే సమయంలో 13 మంది పిల్లల్ని కొనుగోలు చేసిన తల్లిదండ్రులపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో ఆ పేరెంట్స్‌ను నిందితులుగా ఈ కేసులో చేర్చారు. దీంతో వాళ్లంతా లబోదిబోమంటున్నారు.
ఇదీ చదవండి: వాట్సాప్‌లో ఫొటోలు.. ముహూర్తం రోజున డెలివరీ..
Comments
Please login to add a commentAdd a comment