‘నామినేటెడ్’పై కసరత్తు షురూ!
♦ అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా కొన్ని పదవులు భర్తీ
♦ పార్టీ ఆవిర్భావ సభ నాటికి పూర్తి?
♦ టీఆర్‌ఎస్ నేతల్లో ఆశల మోసులు
సాక్షి, హైదరాబాద్: ఇరవై నెలలుగా అధికారిక పదవుల కోసం ఎదురుచూపుల్లోనే గడిపిన అధికార టీఆర్‌ఎస్ నేతల కోరిక నెరవేరబోతోంది. ఎట్టకేలకు గులాబీ నాయకత్వం నామినేటెడ్ పదవులపై కసరత్తు షురూ చేసింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగా కనీసం కొన్ని పదవులనైనా భర్తీ చేసే యోచనలో నాయకత్వం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్ నెలాఖరున జరగాల్సిన పార్టీ ఆవిర్భావ సభ, ప్లీనరీ నాటికి ప్రభుత్వం ద్వారా భర్తీ చేయాల్సిన అన్ని రకాల అధికారిక పదవుల పంపకాన్ని పూర్తి చేయాలన్న నిర్ణయం జరిగిందని ఆ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ప్లీనరీ తర్వాత పార్టీ సంస్థాగత కమిటీల నియామకం కూడా ఉంటుందని భావిస్తున్నారు. దీంతో టీఆర్‌ఎస్ నేతల్లో ఆశలు మోసులెత్తుతున్నాయి. వాస్తవానికి గత ఏప్రిల్‌లో జరిగిన పార్టీ ప్లీనరీ, 14వ ఆవిర్భావ బహిరంగ సభ లో సీఎం కేసీఆర్ నామినేటెడ్ పదవులపై ప్రకటన చేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలక మండళ్ల నియామకానికి రిజర్వేషన్లూ ఖరారు చేసినందున ఇక భర్తీ ఒక్కటే మిగిలిందని అంటున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని వ్యవసాయ మార్కెట్లకు సంబంధిత ఎమ్మెల్యేలు జాబితాలు కూడా అందజేశారు. ఇవేకాకుండా దేవాలయ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థలు తదితర పలు నామినేటెడ్ పదవులను భర్తీ చేయాల్సి ఉంది.
ఎమ్మెల్యేల్లోనూ పెరిగిన పోటీ
రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులకు ఎమ్మెల్యేల్లోనూ పోటీ బాగా పెరిగింది. పార్టీ అధికారంలోకి వచ్చి మరో నాలుగు నెలలు గడిస్తే రెండేళ్లు పూర్తవుతుంది. మిగిలి ఉండే మూడేళ్లలో తమకు అందివచ్చే అవకాశాలపై వీరికి ఏమాత్రం నమ్మకం లేదు. రాష్ట్రస్థాయి కార్పొరేషన్లలో కేబినెట్ ర్యాంకు స్థాయి పదవులు కూడా ఉండటంతో ఎమ్మెల్యేల్లో పోటీ ఎక్కువైందని చెబుతున్నారు. ఇందులో ఆర్టీసీ చైర్మన్ పదవికి డిమాండ్ బాగా ఉంది. ఈ పదవి కోసం నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. వివిధ సమీకరణాల వల్ల మంత్రులుగా అవకాశం రాని సీనియర్లు కొందరు రాష్ట్రస్థాయి కార్పొరేషన్లపై ఆశ పెట్టుకున్నారు. పద్నాలుగేళ్లపాటు పార్టీతో కొనసాగిన సీనియర్లు చాలామందికి ఇప్పటిదాకా ఎలాంటి అవకాశం రాలేదు. ఇందులో ఎమ్మెల్యేలుగా టికెట్ రాక భంగపడిన వారు మొదలు, ఆయా నియోజకవర్గాల్లో ఓడిపోయిన నేతల దాకా ఉన్నారు. వీరంతా ఇపుడు పదవులు ఆశిస్తున్న వారే కావడం గమనార్హం. మరోవైపు ఆయా పార్టీల నుంచి వలస వచ్చిన ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల వెంట టీఆర్‌ఎస్‌కు వలస వచ్చిన నాయకులకూ ఈ పదవులపై ఆశ ఉంది.