
ఎన్టీపీసీ విస్తరణకు మార్గం సుగమం
♦ రామగుండం ఎన్టీపీసీకి పర్యావరణ అనుమతులు జారీ
♦ అక్కడ 30 ఏళ్లలో గరిష్ట ఉష్ణోగ్రత 4 డిగ్రీలు పెరిగినట్లు
♦ వాతావరణ శాఖ పేర్కొందని ఉత్తర్వుల్లో వెల్లడి
♦ పెరిగినది 1.6 డిగ్రీల్లోపేనని ఎన్టీపీసీ స్పష్టం చేసినట్లుగా వివరణ
సాక్షి, హైదరాబాద్: ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రం విస్తరణకు మార్గం సుగమమైంది. కరీంనగర్ జిల్లా రామగుండంలో ఉన్న ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రంలో 1,600 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్ల నిర్మాణానికి కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అనుమతులు జారీ చేసింది. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలను నిర్మిస్తామని రాష్ట్ర పునర్విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది. అందులో భాగంగానే రామగుండంలో 1,600 మెగావాట్ల విద్యుత్ కేంద్రాలను నిర్మించేందుకు ఎన్టీపీసీ చర్యలు చేపట్టింది. దీనిపై తాజాగా కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ షరతులతో కూడిన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే రామగుండంలో వాతావరణం, ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులపై వాతావరణ శాఖ, ఎన్టీపీసీల వాదోపవాదాలను ఉత్తర్వుల్లో పొందుపరిచింది. రామగుండంలో ఇప్పటికే 2,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఉన్న నేపథ్యంలో.. ఇక్కడ ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోయాయని గత 30 ఏళ్లలో రామగుండంలో సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు ఏకంగా 4 డిగ్రీలు పెరిగాయని, రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రం వద్ద 1951-1980 మధ్య కాలంలో ఉన్న గరిష్ట ఉష్ణోగ్రతలతో 2014 నాటి గరిష్ట ఉష్ణోగ్రతలను పోల్చి ఈ విషయాన్ని నిర్ధారించినట్లుగా ఐఎండీ పేర్కొందని వెల్లడించింది. అయితే ఐఎండీ లెక్కల ప్రకారమే 1951-1980, 1971-2000, 2001-2015 మధ్యకాలంలో 0.3 నుంచి 1.6 డిగ్రీల వరకు మాత్రమే గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదైందని ఎన్టీపీసీ యాజమాన్యం స్పష్టం చేసినట్లు తెలిపింది.