రేపు ఉ.11 గంటలకు అంతా స్టాండప్!
హైదరాబాద్: జనవరి 30న అమరవీరుల దినోత్సవాన్ని ప్రతిఒక్కరు తమ బాధ్యతగా జరుపుకునేలా చేయాలని నగర ట్రాఫిక్ పోలీస్ విభాగం భావిస్తోంది. రేపు ప్రతి ఒక్కరూ అమరుల త్యాగాలకు గుర్తింపుగా ఉదయం 11 గంటలకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని ఓ ప్రకటనలో వెల్లడించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరుల కోసం ఉదయం 11 గంటల నుంచి రెండు నిమిషాల పాటు రోడ్లపై ఎక్కడివారు అక్కడే ఆగిపోవాలని, మౌనం పాటించాలని వాహనదారులు పోలీసులకు సహకరించాలని నగర పోలీసులు సూచించారు.
భారత స్వాతంత్ర్య పోరాట యోధుడు మహాత్మగాంధీ హత్యకు గురైన జనవరి 30ని అమరుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. జనవరి 30న ఉదయం 11గంటల ప్రాంతంలో ఎవరు ఎలాంటి పనుల్లో ఉన్నా వాటన్నింటిని నిలిపేసి ఓ రెండు నిమిషాలపాటు మౌనంపాటించి గాంధీ మహాత్ముడికి శ్రద్ధాంజలి ఘటిస్తూ అమరులందరికీ మనసులో వందనం చేసుకునేలా చేయాలని భావించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశాలు జారీచేసిన విషయం విదితిమే.