
సాక్షి, హైదరాబాద్: కుమారి ఆంటీ.. ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పేరు. హైరాబాద్‌లోని మాదాపూర్ ఏరియాలో రోడ్డుపై మీల్స్ అమ్మే కుమారి ఆంటీ.. ఒకే ఒక్క డైలాగ్‌తో ఫేమస్ అయిపోయింది. ‘మీది మొత్తం థవ్‌జండ్ (వెయ్యి రూపాయిలు).. రెండు లివర్లు ఎక్స్‌ట్రా’ అని ఆంటీ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్.. ఇలా ఏది ఓపెన్ చేసినా సరే కుమారి ఆంటీ వీడియోలే దర్శనమిస్తున్నాయి. ఆమె మాటలతో రీల్స్ కూడా క్రియెట్ చేస్తున్నారు.
తాజాగా హైదరాబాద్ సిటీ పోలీసులు ట్విటర్‌లో ఓ ట్వీట్ చేశారు. దీనిని చూస్తుంటే కుమారీ ఆంటీని పోలీసులు కూడా ఫాలో అవుతున్నారనిపిస్తుంది. అసలేం పోస్టు చేశారంటే.. ‘ మీది మొత్తం వెయ్యి రూపాయిలు.. యూజర్ ఛార్జీలు ఎక్స్‌ట్రా’ అంటూ బుల్లెట్ మీద వెళ్తున్న ఓ వ్యక్తి హెల్మెట్ లేకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ, ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్న ఫొటోను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. ఈ ఫొటోకు..ట్రాఫిక్ నియమాలు పాటించండి.. క్షేమంగా ఇంటికి చేరుకోండి అని పేర్కొన్నారు.
Midhi motham 1000 ayindhi, user charges extra...#FollowTrafficRules #BeSafe#CellPhoneDriving pic.twitter.com/9kpxRKP8Ov— Hyderabad City Police (@hydcitypolice) February 20, 2024
ఇది చూసిన నెటిజన్లు.. కుమారి ఆంటీ డైలాగ్ గుర్తుకు తెచ్చుకుని మరీ నవ్వుకుంటున్నారు. కుమారి ఆంటీని బాగానే ఫాలో అవుతున్నారుగా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరేమో ఎమోజీలు, కుమారి ఆంటీ డైలాగ్ వీడియోలు పోస్టు చేస్తూ నవ్వులు పూయిస్తున్నారు. ఇదొక్కడే కాదు సమయం, సందర్భాన్ని బట్టి సినిమా డైలాగ్స్, సోషల్ మీడియాలో పాపులర్ అయిన డైలాగ్స్‌ను ఉపయోగిస్తూ ట్రాఫిక్ నిబంధనలపై హైదరాబాద్ సిటీ పోలీసులు వినూత్నంగా అవగాహన కల్పిస్తుంటారు.
చదవండి: ఆర్టీసీ ప్రయాణికుల అసౌకర్యంపై ఎండీ సజ్జనార్ స్పందన