
పిరికిపందలు, నిస్సిగ్గుగా వ్యవహరించారు
మంత్రి పదవుల్లో రాజీపడ్డారు
ఎన్డీఏ మిత్రపక్షాలపై మమత ధ్వజం
కోల్‌కతా: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎక్కువకాలం కొనసాగదని, త్వరలోనే కూలిపోతుందని పశి్చమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. బెదిరించి, భయపెట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. మమత ఏ పార్టీ పేరు తీసుకోకపోయినప్పటికీ ఆమె పరోక్షంగా ఎన్డీఏ కీలకపక్షాలను ఉద్దేశించే పలు ఘాటు విమర్శలు చేశారు. అమరువీరుల దినోత్సవ భారీ ర్యాలీలో మమత ఆదివారం మాట్లాడారు.
‘పిరికిపందలు, అత్యాశాపరులైన నాయకులు ఆర్థిక తాయిలాలకు లొంగిపోయారు. మంత్రిపదవులకు బదులుగా డబ్బు ఇస్తామనడం ఎప్పుడైనా విన్నామా? పార్టీలు డబ్బుకు అమ్ముడు పోవడం చూశామా? వాళ్లు (ఎన్డీఏ మిత్రపక్షాలు) పిరికిపందలు, సిగ్గులేని వారు. అత్యాశాపరులు. అస్తిత్వాన్ని తాకట్టు పెట్టారు’ అని మమత ధ్వజమెత్తారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఎక్కువకాలం కొనసాగదని, మతతత్వశక్తులకు విజయం లభించినా.. ఓటమి తప్పదని అఖిలేశ్ అన్నారు.