హే గాంధీ..!
గాంధీ ఆస్పత్రి లిఫ్ట్‌లో
గాయపడ్డ వృద్ధురాలు మృతి
బంధువుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: లెక్కకే పదహారు లిఫ్ట్‌లు... కానీ అందులో పనిచేసేవి మూడే మూడు! నిర్వహణకు అతీగతీ లేదు. కనీసం రిపేరులో ఉన్నవాటి వద్ద హెచ్చరికల బోర్డులు గానీ, గార్డులు గానీ లేరు. ఫలితంగా నిత్యం గాంధీ ఆస్పత్రికి వచ్చే పేద రోగులు తెలియక వీటిల్లో ఎక్కి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇక్కడిలాంటి ఘటనలు 25కి పైగానే జరిగినా అధికారుల్లో చలనం లేదు. తాజాగా రిపేరులో ఉన్న లిఫ్ట్ తలుపు తెరిచి సెల్లార్‌లో పడటంతో గాయపడిన సిద్దిపేట వాసి ఎల్.పోచవ్వ(61) గురువారం మృతిచెందారు.
ఈ నెల 4న ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన కుమారుడికి సహాయంగా వచ్చిన సందర్భంగా పోచవ్వ ఈ ప్రమాదానికి గురయ్యారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే పోచవ్వ మరణించిందని ఆరోపిస్తూ ఆమె బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. దీనికి కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేసి, బాధితురాలి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
13 లిఫ్ట్‌లు రిపేరులో...
8 అంతస్థులున్న గాంధీ ఆస్పత్రిలోని రెండు బ్లాకుల్లో కలిపి మొత్తం 16 లిఫ్టులున్నాయి. వీటిల్లో 13 పనిచేయడం లేదు. నిత్యం సుమారు మూడు వేల మంది రోగులు వస్తుం టారు. 1,500 మంది చికిత్స పొందుతుం టారు. సగటున 80-100 శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. రోగుల తరలింపులో లిఫ్ట్‌లే కీలకం. పనిచేస్తున్న మూడు లిఫ్టుల్లోనూ ఒకటి సిబ్బందికి కేటాయించారు. మిగిలిన రెండూ వచ్చే రోగులు, వారి సహాయకులకు ఏమాత్రం సరిపోవడం లేదు.
దీనికితోడు రిపేరులో ఉన్న లిఫ్ట్‌లను ఎలాంటి హెచ్చరిక సూచీలు, గార్డులూ లేకుండా గాలికొదిలేశారు. దీంతో తరచూ ఎవరో ఒకరు వాటి తలుపులు తెరవడం, ఇరుక్కుపోయి గాయపడటం ఇక్కడ సాధారణంగా మారిపోయింది. ఇంత జరుగుతున్నా అధికారులు కళ్లప్పగించి చూడటమే గానీ... తగిన చర్యలు తీసుకోవడం లేదు.
విచారణకు త్రిసభ్య కమిటీ
ఆస్పత్రిలో లిఫ్ట్‌లు పనిచేయడం లేదని, మరమ్మతులు చేయించాలని అనేకసార్లు టీఎస్‌ఎంఐడీసీకి విన్నవించాం. 2014-15 వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వం ఆస్పత్రికి కేటాయించిన రూ.100 కోట్లలో రూ.10 కోట్లు లిఫ్ట్‌ల మరమ్మతులకే ప్రతిపాదించాం. నేటికీ ఆ పనులు జరగలేదు. పోచవ్వ మృతి ఘటనపై విచారణకు త్రిసభ్య కమిటీ వేశాం. నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఆ రోజున విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డును ఇప్పటికే సస్పెండ్ చేశాం.
- డాక్టర్ జేవీ రెడ్డి, సూపరింటెండెంట్,గాంధీ ఆస్పత్రి