
వేటకు వెళ్లి మృత్యువాత
అడవి పందుల దాడిలో ఒకరి మృతి
హైదరాబాద్: వేటకు వెళ్లిన ఓ వ్యక్తి అడవి పందుల దాడిలో మృతి చెందాడు. ఈ సంఘటన హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గచ్చిబౌలి ప్రాంతంలోని గౌలిదొడ్డిలో నివాసం ఉండే జెర్రి అశోక్(45) ఈ నెల 11న ఉదయం సమీపంలోని శంకర్‌హిల్స్‌లో గల అటవీ ప్రాంతానికి వేటకు వెళ్లాడు. పొదల్లో ఉన్న పందులు ఒక్కసారిగా అశోక్‌పై దాడి చేశాయి. మర్మాంగాలతో పాటు పొట్టలోపల బలమైన గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అశోక్‌ను స్థానికులు కొండాపూర్‌లోని ఏరియా ఆస్పత్రికి తరలించారు.
మెరుగైన చికిత్సకోసం 12న రాత్రి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. అడవి పందులు బలంగా గుద్దడంతో మర్మాంగాలతోపాటు పొట్ట, ఛాతీ భాగంలో బలమైన గాయాలు కావడంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అశోక్ కుక్కలను తీసుకొని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, శంకర్‌హిల్స్ ప్రాంతాల్లో అడవి జంతువులు, పక్షులను తరచూ వేటాడేవాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో వేటకు వెళ్లి మృత్యువాత పడటంతో గౌలిదొడ్డిలో విషాదఛాయలు అలుముకున్నాయి.