హైదరాబాద్ : డిజిటల్ మార్కెటింగ్ పేరుతో పలువురికి టోకరా వేస్తున్న శ్రీకాకుళం వాసిని సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. బ్యాంకు అకౌంట్ అందించడం ద్వారా ఇతడికి సహకరించిన వ్యక్తిని కటకటాల్లోకి పంపినట్లు డీసీపీ అవినాష్ మహంతి పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా తాళ్లవసలకు చెందిన బాలగంగాధర్ గతంలో గూగుల్ కంపెనీలో పని చేశాడు. ఇతడికి డిజిటల్ మార్కెటింగ్‌కు సంబంధించిన గూగుల్ యాడ్‌వర్డ్స్ ఇన్వాయిస్ అకౌంట్‌పై పరిజ్ఞానం ఉంది. డిజిటల్ మార్కెటింగ్ చేయాలని భావించిన వారు ఈ అకౌంట్‌ను ఖరీదు చేయడం ద్వారా ప్రచారం చేసుకుంటారు.
ఇలాంటి అకౌంట్స్ అవసరమైన వారి ఫోన్ నెంబర్లు సేకరించిన బాలగంగాధర్ వివిధ పేర్లతో వారికి ఫోన్లు చేసే వాడు. తక్కువ ధకకే గూగుల్ యాడ్‌వర్డ్స్ ఇన్వాయిస్ అకౌంట్ ఇప్పిస్తానంటూ నమ్మించేవాడు. అందుకు అంగీకరించిన వారిని అడ్వాన్స్‌గా రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు బ్యాంకు ఖాతాలో వేయని చెప్పేవాడు. తన స్నేహితుడైన బి.భానూజీరావు బ్యాంకు ఖాతాను దీనికి వాడుకుంటూ అతడికి కొంత కమీషన్ చెల్లిస్తున్నాడు.
నారాయణగూడకు చెందిన డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్ ఎ.రాధాకృష్ణను గత నెల్లో సంప్రదించిన గంగాధర్ గూగుల్ యాడ్‌వర్డ్స్ ఇన్వాయిస్ అకౌంట్ అందిస్తానన్నాడు. ఒక్కో దాని ధర రూ.2 లక్షల వరకు ఉండగా... ఆ రేటుకే మూడు ఇప్పిస్తానంటూ నమ్మించి రూ.లక్ష డిపాజిట్ చేయించుకుని మోసం చేశాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ టీమ్ ఇన్‌స్పెక్టర్ జి.శంకర్‌రావు గురువారం బాలగంగాధర్‌తో పాటు భానూజీరావును అరెస్టు చేశారు. బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.3.66 లక్షల్ని ఫ్రీజ్ చేశారు.