సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్రంలో బహుశా ఏ యూనివర్సిటీలో లేని విచిత్ర పరిస్థితి ఫైనార్ట్స్ యూనివర్సిటీలో ఏర్పడింది. ఒక్క యూనివర్సిటీకి ఇద్దరు ఇంచార్జీ వీసీలు ఉన్న దాఖలాలు ఎక్కడా కనిపించవేమో. కానీ ఇక్కడ మాత్రం ఇద్దరు ఇంచార్జీ వీసీల పాలన సాగుతోంది. నగరం నడిబొడ్డున ఉన్న జేఎన్‌ఏఎఫ్‌ఏ యూనివర్సిటీలోని విచిత్ర పరిస్థితిపై వర్సిటీ ఉద్యోగులు బిత్తరపోతున్నారు.
ఇక్కడ నెలకొన్న పరిణామాలపై ప్రభుత్వ పెద్దలు కూడా పట్టించుకోకపోవడంతో సిబ్బంది పరిస్థితి ముందు నుయ్యి..వెనుక గొయ్యిలా మారింది. జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఇంచార్జి వీసీగా ఉన్న ప్రొఫెసర్ పద్మావతిని తొల గించి..ఆ బాధ్యతలను విదేశీ పర్యటనలో ఉన్న జేఎన్టీయూహెచ్ వీసీకి అప్పగించడం, ప్రభుత్వ ఉత్తర్వులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ప్రొ.పద్మావతికి కోర్టు నుంచి స్టేఆర్డర్స్ లభించిన సంగతి తెలిసిందే. వర్సిటీలో నెలకొన్న అనిశ్చితిని తొలగించేందుకు ప్రభుత్వపరంగా చర్యలు చేపడుతున్న దాఖలాలు ఇప్పట్లో మచ్చుకు కూడా కనిపించడం లేదు.
వర్సిటీలో వర్గపోరు: న్యాయస్థానం నుంచి స్టేఆర్టర్స్ మేరకు ప్రొ.పద్మావతి ఈనెల 11నుంచి ఇంచార్జి వీసీగా తిరిగి విధుల్లో కొనసాగుతున్నారు. అయితే.. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల మేరకు జేఎన్టీయూహెచ్ వీసీ రామేశ్వరరావు ఈనెల 13న జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఇంచార్జి వీసీగా బాధ్యతలు స్వీకరించారు. వీసీ నియామకంపై ప్రతిష్టంభన నెలకొనడంతో వర్సిటీ అధ్యాపకులు, సిబ్బంది రెండువర్గాలు చీలిపోయారు. న్యాయస్థానం నుంచి స్టేఆర్డర్ తమకు చేరనందున ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రామేశ్వరరావు బాధ్యతలు స్వీకరించినట్లు వర్సిటీలో ఓ వర్గం వాదిస్తుండగా..రామేశ్వరరావు విదేశీ పర్యటన నుంచి రాకమునుపే ప్రభుత్వ ఉత్తర్వులపై న్యాయస్థానం స్టేఆర్డర్స్ ఇచ్చిందని, వీసీగా కొనసాగే అర్హత పద్మావతికే ఉందని మరోవర్గం అంటోంది.
కదలని ఫైళ్లు : వర్సిటీలో నెలకొన్న విచిత్ర పరిస్థితితో అనేక ఫైళ్లు పేరుకుపోతున్నాయి.న్యాయస్థానం ఆదేశాల మేరకు వీసీ కుర్చీలో కూర్చున్న పద్మావతి చాంబర్‌కి గానీ, జేఎన్టీయూహెచ్ వీసీకి గానీ వర్సిటీ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఫైళ్లు వెళ్లడం లేదని సమాచారం. ఫైళ్లు కదలకపోవడంతో పరి పాలనలో ప్రతిష్టంభన ఏర్పడింది. వర్సిటీలో నెలకొన్న పరి ణామాలపై రిజిస్ట్రార్ కవితా దరియానిని ‘సాక్షి’ వివరణ కోరగా..ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉందని, ఇంతకు మిం చి తానేమీ చెప్పలేనన్నారు. ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా స్పందించి విశ్వవిద్యాలయానికి ఇంచార్జి ‘వీసీ ఎవరు’ అన్న అంశాన్ని త్వరగా తేల్చాలని అధ్యాపకులు,సిబ్బంది కోరుతున్నారు.
దటీజ్ ఫైనార్ట్స్..
Published Fri, Oct 18 2013 4:20 AM | Last Updated on Fri, Sep 1 2017 11:44 PM
Advertisement
Advertisement